DailyDose

జోరు అందుకున్న భారత మార్కెట్లు-వాణిజ్యం-12/17

Indian Stock Markets On High Rise-Telugu Business News-12/17

* స్టాక్‌మార్కెట్లు జోరుమీదున్నాయి. సెన్సెక్స్ ఇవాళ ఉద‌యం 324 పాయింట్ల దూకుడును ప్ర‌ద‌ర్శించింది. దీంతో ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 41 వేల 262.88 పాయింట్ల రికార్డును చేరుకున్న‌ది. ట్రేడింగ్‌లో ఇది కొత్త ఆల్‌టైమ్ రికార్డు. ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ల స్పంద‌న పాజిటివ్‌గా ఉన్న నేప‌థ్యంలో సెన్సెక్స్ కూడా ప‌రుగులు తీసింది. ఆసియా మార్కెట్ల షేర్లు కూడా ఏడాది కాలంలో మొద‌టిసారి ఇవాళ హ‌య్య‌స్ట్ మార్క్ వ‌ద్ద ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ మాత్రం 30 పాయింట్లు ఎక్కువ‌గా ట్రేడ్ అయ్యింది. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్‌, ఐటీసీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, మారుతీ సుజికి లాంటి సంస్థ‌లు సెన్సెక్స్‌లో స‌త్తా చాటాయి.

* వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,060, విజయవాడలో రూ.38,800, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.38,030గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,250, విజయవాడలో రూ.35,900, ప్రొద్దుటూరులో రూ.35,960, చెన్నైలో రూ.36,220గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,300, విజయవాడలో రూ.45,400, ప్రొద్దుటూరులో రూ.45,400, చెన్నైలో రూ.47,500 వద్ద ముగిసింది.

* భారతీయ బ్యాంకులు ఈ నెలలో తమ మొండి బకాయిల్లో 7.6బిలియన్‌ డాలర్లను తిరిగి వసూలు చేసుకొనేందుకు రంగం సిద్ధమైంది. దివాల పరిష్కార న్యాయస్థానం కేసుల విచారణను వేగవంతం చేయడంతో రికవరీ జరగవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎస్సార్‌ స్టీల్‌, ప్రయాగ్‌రాజ్‌ పవర్‌ జనరేషన్‌, రుచి సోయా ఇండస్ట్రీస్‌, రత్తన్‌ ఇండియా పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక కేసుల భవితవ్యం డిసెంబర్‌లో తేలిపోనుంది.

* ప్రైవేటు రంగానికి చెందిన యెస్‌ బ్యాంకుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్బీఐ సహాయం చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆ సంస్థ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తిరస్కరించారు. యెస్‌ బ్యాంకును ఎస్బీఐ కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం, ఎస్బీఐ దాన్ని కొనడం లేదని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన ఇండియా కాంక్లేవ్‌ సమావేశంలోనూ రజనీశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రైవేటు బ్యాంకును కొనడానికి తమ వద్ద తగినన్ని నిధులు లేవని ఆయన వెల్లడించారు. వాస్తవానికి యెస్‌ బ్యాంకును కొనడానికి కొటక్‌ మహీంద్రా బ్యాంకు సరైనదని ఆయన సూచించారు.