Kids

నెయ్యి కట్టెలు-తెలుగు చిన్నారుల కథ

Ghee And Fire Wood Story For Kids In Telugu - Dec 2019

ఒక ఊరిలో ఒక భార్య -భర్త ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఒకరినొకరు చాలా బాగా చూసుకునేవాళ్లు. ఇద్దరూ ముచ్చటగా ఒకరికొకరు ముద్దు పేర్లు పెట్టుకున్నారు. భర్తకు భార్య చేసే శనగవిత్తనాల పొడి అంటే చాలా ఇష్టం. అందుకని అతను భార్యను ముద్దుగా ‘పొడీ!’ అని పిలుచుకునేవాడు. భార్యకు భర్త కాచే నెయ్యంటే చాలా ఇష్టం. అందుకని ఆమె భర్తను ముద్దుగా ‘నెయ్యి’ అని పిలిచేది. ఇక , వాళ్ళకు రెండు ఎద్దులు ఉండేవి. వాటికి కూడా ముద్దు పేర్లు పెట్టుకున్నారు వీళ్లు. ఒక దాని పేరు వాణి. ఇంకో దాని పేరు కట్టె. అలా నెయ్యి, పొడి, వాణి, కట్టె- అందరూ కలిసి సుఖంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు.

అతిథి అభ్యాగతులు ఎవరయినా వాళ్ల ఇంటికి వస్తే, వాళ్ళకు అన్నం పెట్టకుండా పంపించేవాళ్లు కాదు పొడీ-నెయ్యిలు. ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయానికి, నెయ్యి పొలం దున్నుతూ ఉంటే , ఒకవైపు నుండి ఒక స్వామి గస బోసుకుంటూ వచ్చాడక్కడికి.

“ఏంటి స్వామీ! అలసిపోయినట్టున్నారు? ప్రక్క ఊరినుండి నడుచుకొని వచ్చినట్టున్నారు, పాపం?” అని అడిగాడు నెయ్యి, ఆయన్ని.

అప్పుడు స్వామి “అవును నాయనా! ఆ ఊరినుండీ నడవటం వల్లనే అయిఉండొచ్చు, చాలా ఆయాసంగా ఉంది” అన్నాడు.

అప్పుడు నెయ్యి ఆయనకు త్రాగేందుకు నీళ్లు ఇచ్చి, “స్వామీ! నాకేమో ఇంకా కొంచెం పని ఉన్నది. చూడగా మీకు ఆకలి వేస్తున్నట్లుంది. దూరంగా ఆ కనబడేదే మాయిల్లు. మా ఇంటిలో పొడి ఉంటుంది. వెళ్ళి అన్నం పెట్టించుకొని కడుపునిండా తినండి- ఏమీ అనుకోకండి, వెళ్ళండి!” అని చెప్పాడు.

స్వామికి “‘పొడి’ అంటే ‘నెయ్యి’వాళ్ల భార్య” అని తెలీదు. “మామూలుగా ఊళ్లలో ప్రతి ఇంట్లోనూ చేసుకునే శనగ విత్తనాల పొడి – అదొక్కటే ఉందేమోలే, వీళ్ల ఇంట్లో”అనుకున్నాడు స్వామి.

“పొడి ఉంటే అంతే చాలు నాయనా, కాలే కడుపుకు మండే బూడిదైనా చాలు. నేను మీ ఇంటికి వెళ్ళి అన్నం తిని వెళ్తాను” అని చెప్పి నేరుగా నెయ్యి వాళ్ళ ఇంటికి పోయాడు స్యామి.

ఇంట్లో పొడి స్వామిని చూడగానే, “రండి, రండి, స్వామీ!” అని లోనికి ఆహ్వానించి, పీట వేసి కూర్చోబెట్టింది. ఆపైన ఆమె మర్యాదగా “స్వామీ! మీరు ఇప్పుడే తింటారా, లేక నెయ్యి వచ్చిన తరువాత తింటారా?” అని అడిగింది.

కానీ స్వామికి ‘నెయ్యి’ అంటే ‘ఆవిడ భర్త’ అని తెలీదు. “ఓ ,నెయ్యి వస్తుందట! పొడిలోకి నెయ్యి చాలా బాగుంటుంది!” అని అనుకొని, ఆయన “పర్వాలేదులేమ్మా! నెయ్యి వచ్చిన తరువాతే తింటాను” అన్నాడు.
అంతలోనే నెయ్యి ఇల్లు చేరుకున్నాడు. అతను భోజనానికి వచ్చేందుకు పనిని ఆపి, ఎద్దుల్ని విడిపించగానే ఆ ఎద్దుల్లో ఒకటి- “కట్టె” అనేది- పారిపోయింది. ‘దాని వెంటపడితే వాణి కూడా ఎక్కడికి పారిపోతుందో’ అని, అతను దానిని అలాగే వదిలి, వాణిని ఇంటికి పట్టుకొచ్చాడు.

ఇంటికి రాగానే అతను పొడిని కేక వేస్తూ- “ఏమేవ్, వాణ్ని గాటకు కట్టేయి. ఆలోగా నేను కట్టెను పట్టుకొస్తాను” అన్నాడు.

ఈ మాట విన్న స్వామి “అయ్యో! నేనేం తప్పు చేశాను దేవుడా, నన్ను గాటకు కట్టేయమంటున్నాడు? తను పోయి కట్టె తెస్తాడట.ఇక్కడే ఉంటే నన్ను చితకబాదుతారు బాబోయ్!” అనుకొని , పంచె ఎత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండ బయటికి పరుగుతీశాడు.

ఆలోగా నెయ్యి వెళ్ళి, పారిపోయిన ఎద్దును పట్టుకొచ్చాడు. లోపలికి వచ్చి చూసేసరికి, అక్కడుండాల్సిన స్వామి లేడు! “అయ్యో, స్వామీ! ఎక్కడికి పోయారు?” అని బయటకు వచ్చి చూస్తే దూరంగా స్వామి పరిగెడుతూ కనబడ్డాడు.

అప్పుడు నెయ్యి ఆయన వెనకే పరుగెడుతూ “అయ్యా, స్వామీ!” అని అరవసాగాడు. ఎవరో పిలుస్తున్నట్లుందే అని వెనక్కి తిరిగిచూసిన స్వామికి నెయ్యి కనబడ్డాడు. నెయ్యి చేతిలో చర్నాకోల మెరుస్తున్నది! అతను దాన్ని ఊపుతూ, “స్వామీ! ఆగండి! రండి! పొడి ఉన్నది, నాకు మా కట్టె దొరికిందిలెండి ” అని అరుస్తుంటే స్వామి ప్రాణాలు చేత బట్టుకొని పరుగుతీశాడు, వేగం పెంచి.

ఆయనను అందుకోలేని నెయ్యి “ఇదేమి, స్వామివారు ఎందుకు, నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగుతీశారు? స్వాముల లీలలు బహు చిత్రాలు” అనుకుంటూ వెనుతిరిగి ఇంటికి పోయాడు!