వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు తొలి మ్యాచ్‌ను ఎవరితో తలపడనున్నాయో ఖరారైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఈవెంట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. జులై 24న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. తర్వాతి రోజు నుంచి క్రీడా సమరం మొదలవుతుంది. ‘గ్రూప్-ఏ’లో ఉన్న భారత పురుషుల జట్టు జులై 25న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (జులై 26న), స్పెయిన్ (జులై 28న), అర్జెంటీనా (జులై 30న), ఆతిథ్య జట్టు జపాన్‌తో (జులై 31న) గ్రూప్ మ్యాచ్‌లు తలపడనుంది. ‘గ్రూప్-ఏ’లోనే ఉన్న భారత మహిళల జట్టు జులై 25న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. తర్వాత వరుసగా జర్మనీ (జులై 27న), బ్రిటన్ (జులై 29న), ఐర్లాండ్ (జులై 31న), దక్షిణాఫ్రికా (ఆగస్టు 1న) జట్లతో భారత్ గ్రూప్ మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. పురుషుల జట్టు ఫైనల్స్ ఆగస్టు 6న, మహిళల జట్టు తుదిపోరు ఆగస్టు 7న జరగనుంది. ఇటీవల భువనేశ్వర్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు రష్యాను 11-3 తేడాతో, మహిళల జట్టు అమెరికాను 6-5 తేడాతో మట్టికరిపించి మెగా టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.
టోక్యో ఒలంపిక్స్‌లో కివీస్‌తో తొలిపోరు
Related tags :