Politics

పోతిరెడ్డిపాడుపై కోదండరాం వ్యాఖ్యలు

Kodandaram Comments On AP Decision Over PothireddyPadu

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యతిరేకించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని అన్నారు. అప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటివాటా రాదని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రమాదకరమైన నిర్ణయమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం రూ.20వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఎక్సైజ్‌ శాఖ మద్యం అమ్మకాలను నియంత్రించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. పర్మిట్‌ రూమ్‌లను, బెల్టు షాపులను తొలగించి, మద్యం అమ్మకాల సమయాన్ని కుదించాలని ప్రభుత్వాన్ని కోరారు.