NRI-NRT

“నెల్లూరి” నేరగాడా…ఆర్థిక నేరాల దూలగాడా!

5 Indians In FBI Custody Over Stock Market Fraud In USA...

ఒక సాఫ్ట్‌వేర్‌ నిపుణుడితో పాటు అతని స్నేహితులైన మరో నలుగురు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా భారీగా లాభాలు ఆర్జించారని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (సెక్‌) నేరారోపణ చేసింది. ఈ అయిదుగురు భారతీయులే. సిలికాన్‌ వ్యాలీలోని ఒక క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ ఆదాయ సమాచారం తెలుసుకున్న వీరు, పలుమార్లు ట్రేడింగ్‌ జరపడం ద్వారా కోట్ల రూపాయలు (మిలియన్స్‌ ఆఫ్‌ డాలర్స్‌) లాభాలు ఆర్జించారన్నది ఆరోపణ. ఈ కేసులో ప్రధాన సూత్రధారి జనార్దన్‌ నెల్లూర్‌ (42). సిలికాన్‌ వ్యాలీలోని ఒక టెక్నాలజీ కంపెనీ ఐటీ నిర్వహణాధికారిగా చేశాడు. తన పరపతితో పాటు విధుల్లో ఏర్పడిన పరిచయాల సాయంతో, తన కంపెనీ ఆర్థిక పనితీరు, త్రైమాసికం వారీగా సేకరించాడని సెక్‌ పేర్కొంది. ఈ ఆర్థిక వివరాల సాయంతో తాను ట్రేడింగ్‌ చేయడంతో పాటు స్నేహితులైన శివన్నారాయణ బరమ (45), గణపతి కునధరాజు (41), సబేర్‌ హుస్సేన్‌ (42), ప్రసాద్‌ మాలెంపాటి (50)లకూ సమాచారం ఇచ్చి, వారితో చేయించాడు. ఈ ఏడాదిలో జనార్దన్‌ను విధుల నుంచి కంపెనీ తొలగించేవరకు ఇలా వ్యవహరించాడు. అయితే ఎక్కడా చిక్కకుండా ఉండేందుకు, తన కంపెనీ స్టాక్‌ను ‘బేబీ’గా జనార్దన్‌ వ్యవహరించేవాడు. స్టాక్‌ విక్రయించాలంటే ‘ఎగ్జిట్‌ బేబీ’, కొనాలంటే ‘ఎంట్రీ ఫ్యూ బేబీ’ అని సంక్షిప్త సందేశాలు, మెయిల్స్‌లో పేర్కొనేవాడు. ఈ విధానాలతో 2017లోనే 7 మిలియన్‌ డాలర్లు (రూ.49 కోట్లకు పైగా) వీరు అక్రమంగా ఆర్జించినట్లు సెక్‌ ఆరోపించింది. ఈ లాభాలను కొందరు ట్రేడర్లు చిన్నమొత్తాల్లో జనార్దన్‌కు పంపి, ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డారని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) విచారించాక, జనార్దన్‌ భారత్‌ వచ్చేందుకు తనకు, కుటుంబసభ్యులకు ఒకవైపు టికెట్లు మాత్రమే కొనుగోలు చేయడంతో, విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు సెక్‌ పేర్కొంది. వీరిపై నేరారోపణ చేస్తూ, కాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది.