అట్రాసిటీ కేసులు నమోదు చేసి తెదేపా నేతలను బెదిరిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆత్మకూరులో 130 మందిని ఊరి నుంచి తరిమేశారని చెప్పారు. తెదేపా కార్యకర్తలను పోలీసులు దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలు, కార్యకర్తలతో అనంతపురంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లాలో తెదేపాకు చెందిన 40 మందిపై కేసులు పెట్టారని చెప్పారు. ‘ కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. సీఐ భక్తవత్సలరెడ్డిపై ప్రైవేటు కేసు వేశాం. పోలీసు దుస్తులు వేసుకున్నందుకు ప్రజలకు న్యాయం చేయాలి. చట్టాలు రక్షించేందుకే పోలీసులున్నారు.చట్టాన్ని అతిక్రమించిన పోలీసులకు జైలు శిక్షలు తప్పవు. పదవీ విరమణ చేసినవారినీ వదిలిపెట్టం’ అని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులు ప్రభుత్వాన్ని కాకుండా చట్టాన్ని గౌరవించాలని చంద్రబాబు కోరారు. వైకాపా బాధితుల కోసం పునరావాస కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, వారిని పరామర్శించేందుకు చలో ఆత్మకూరు పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ‘ఆత్మకూరు వెళ్లకుండా మా ఇంటిగేటుకు తాళ్లు కట్టారు. నన్నే అడ్డుకున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? పల్నాడు పులిలా ఉండే కోడెలను ఎన్నోరకాలు వేధించి, చివరకు ఆత్మహత్యకు కారణమయ్యారు’ అని చంద్రబాబు అన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ‘వైకాపా బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం కట్టించే పూచీ నాది’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘దమ్ముంటే ప్రత్యక్షంగా రండి..ఎక్కడైనా ఎదుర్కొంటాం’ అని సవాల్ విసిరారు. వైకాపా నేతలు పోలీసులను చూపించి భయపెడదామని చూస్తున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. సంయమనం పాటిస్తున్నామని, తప్పు చేసిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కొందరు నేతలు ప్రభుత్వానికి లొంగిపోయి ఇప్పుడు పార్టీనే తిడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
చంద్రబాబు హెచ్చరికలు
Related tags :