* టాటా గ్రూప్ ఉద్యోగులందరూ వ్యాపారాలపై దృష్టి సారించాలని, వాటాదారుల సంక్షేమం కోసం పాటుపడాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన నియామకం చట్టవ్యతిరేకమని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు. కొన్ని విషయాలను పక్కనపెట్టి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తన నియామకాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ తప్పుపట్టిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలను కంపెనీ చూసుకుంటుందన్నారు. అదే సమయంలో గతంలో కంటే కంపెనీని మరింత బలోపేతం చేయాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా ఉద్యోగులందరూ వ్యాపారాలపైనా, వాటాదారుల సంక్షేమంపైనా దృష్టిసారించాలన్నారు.
* దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్ నేడు నిక్సన్ విద్యుత్తు కారు వివరాలను వెల్లడించింది. టాటా నుంచి వస్తున్న రెండో విద్యుత్త కారు ఇది కావడం విశేషం. అంతకు ముంద టిగోర్ పేరుతో ఒక విద్యుత్తుకారును టాటా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో సరికొత్త జిపట్రాన్ ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. కారును 2020 జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ప్రీబుకింగ్స్‌ను రేపటి నుంచి టాటా డీలర్ల వద్ద చేసుకోవచ్చు. రూ.21వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ సూచించింది. అసలు ధరను మాత్రం కారు విడుదల సమయంలో వెల్లడించనున్నారు. ఈ కారులో పర్మినెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఐపీ67 సర్టిఫికెట్ ఉంది. దీనికి 30.2 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జి చేస్తే 300 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో ట్రేడవుతున్నాయి. తొలుత స్వల్పలాభాల్లో మొదలైన మార్కెట్లు సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి 41,500వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టాలతో 12,202 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన షేర్లు తొలుత స్వల్పంగా నష్టపోయినా తర్వాత కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. టాటాస్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి. నిన్న ఎన్‌సీఎల్‌ఏటీ నిన్న టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి అనుకూలంగా తీర్పురావడం ఈ షేర్లపై ప్రభావం చూపిస్తోంది. నేటి మార్కెట్లో టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇక యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
* డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడంలో భాగంగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవల్ని 24గంటలూ కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ తాజాగా ఖాతాదారులకు మరో శుభవార్తను వెల్లడించింది. నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు ఉండబోవని ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులను సంకేతాలిచ్చిన ఆర్బీఐ తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2020 నుంచి నెఫ్ట్‌పై పొదుపు ఖాతాదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది.
* ప్రైవేటు రంగ బ్యాకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. భారత్‌లో ఈ మైలురాయిని చేరుకొన్న మూడో కంపెనీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్(140 బిలియన్ డాలర్లు), టాటా కన్సల్టెన్సీ (114.60 బిలియన్ డాలర్లు) ముందు వరుసలో ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రపంచలోనే అత్యంత విలువైన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 110వదిగా నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో 109 కంపెనీలు 100 బిలియన్ డాలర్లను దాటాయి.
* దేశంలో అత్యంత ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది ఐటీ రంగ ఉద్యోగులు, నిపుణులేనట. ఇక ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు.. జీతాలు ఎక్కువ ఇచ్చే నగరంగా తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ర్యాండ్‌స్టడ్ ఇన్‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ పేర్కొంది. 2019 సంవత్సరానికి గానూ ర్యాండ్‌స్టడ్ ఇన్‌సైట్స్ వేతన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. సిబ్బంది అత్యధిక వేతనాలు పొందే నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. అక్కడ జూనియర్ స్థాయి ఉద్యోగి సగటు వార్షిక వేతనం రూ. 5.27లక్షలు కాగా.. మధ్యస్థాయి ఉద్యోగి సగటున ఏడాదికి రూ. 16.45లక్షలు, సీనియర్ ఉద్యోగి రూ. 35.45లక్షలు అందుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 2017 నుంచి ఈ జాబితాలో బెంగళూరే తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ జాబితాలో హైదరాబాద్, ముంబయి రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో జూనియర్ స్థాయి ఉద్యోగి సగటు వార్షిక వేతనం రూ. 5లక్షలు కాగా.. ముంబయిలో రూ. 4.59లక్షలుగా ఉంది.