Health

ఒంటరితనమా…నిను ఓడించేది ఎలాగమ్మా?

How to beat loneliness anxiety and depression

చుట్టూ మనుషులున్నా కొందరిని ఒంటరితనం వేధిస్తుంది. దాన్ని అధిగమించేందుకు వారు సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తుంటారు. అయినా కూడా వారిని ఒంటరిగా ఉన్నామనే భావన వెంటాడుతూనే ఉంటుంది. అమ్మాయిల్లో అయితే ఈ ధోరణి మరింత అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆన్‌లైన్ బంధాలు మనల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయా లేక మనల్ని మరింత ఏకాకిని చేస్తున్నాయా? అని ఆలోచిస్తే.. ఈ అంశంపై పద్దెనిమిదేళ్ల కేట్ రోబెర్ట్స్, గర్ల్‌రైడింగ్ వెల్లడించిన సర్వే ప్రకారం.. మహిళలు, అమ్మాయిల్లో ఒంటరితనం తీవ్రసమస్యగా ఉంది.. నిత్యం అమ్మాయిలు స్నేహితులతో గడుపుతున్నా కూడా వారు ఒంటరిగానే ఉన్నట్లు ఫీలవుతున్నారు. తమ స్నేహితులు బయటకు వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో చూసి తాము వారితో వెళ్లలేదనే భావనతో ఒంటరితనం ఆవహించినట్లు భావించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి కారణాల వల్ల అమ్మాయిలు తాము ఏకాకులం అని మథనపడే స్థితికి చేరుకుంటున్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాలు మమ్మల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయని అంటుంటే మరికొందరు మాత్రం ఆన్‌లైన్ స్నేహాలు మమ్మల్ని మరింత ఒంటరిని చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల పలు సర్వేలు యువత.. అందులోనూ ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ సంస్థ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యనున్న ప్రతి పదిమంది అమ్మాయిల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తేలింది. ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు కొన్నిసార్లు ఏకాకిగా ఉన్నట్లు ఫీలయ్యామని చెప్పారు. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే తాము ఎక్కువగా ఒంటరివాళ్లమనే భావనలో ఉన్నారు. కొంతమంది తమ ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సామాజిక మాధ్యమాలను వాడుతున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలు కూడా ఒంటరితనంతో బాధపడుతున్నట్లు చైల్డ్‌లైన్ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు వారు సహాయం కోరుతున్నారని పేర్కొంది.
కారణాలు
యువత ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. యువతి అయినా, యువకుడైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటే దానికి ఆన్‌లైన్‌కు వెళ్లడం ఒక్కటే కారణం కాదని గర్ల్‌గైడింగ్ తన సర్వే వివరాల ఆధారంగా పేర్కొంది. ఒంటరిగా ఉన్నట్లు అనిపించడానికి అనేక కారణాలున్నాయని అమ్మాయిలు చెబుతున్నారు.
* ముఖ్యంగా వారితో మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం..
* తమ భావాలను ఎవరూ అర్థం చేసుకోకపోవడం..
* నిజమైన స్నేహితులు దొరకడం కష్టంగా మారడం..
* బయటకు వెళితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇంట్లోనే ఉండటం..
అధిగమించడం ఎలా?
ఇటీవల నిర్వహించిన సర్వేలో చాలామంది మహిళలు ఒంటరితనాన్ని జయించడానికి సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లడం ఒక్కటే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఏడు నుంచి పది సంవత్సరాల మధ్యనున్న బాలికలను సర్వే చేసినప్పుడు స్నేహితులతో మాట్లాడటం ద్వారా ఒంటరితనం నుంచి బయటపడుతామని చెప్పారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, ఆటలు, చిత్రలేఖనం వంటి వ్యాపకాలతో తాము ఏకాకిగా ఉన్నామనే భావనను తొలగించుకుంటామని చాలామంది అమ్మాయిలు చెప్పారు.