Politics

చంద్రబాబుకి సొంత పార్టీలోనే వ్యతిరేకత

Kodali Nani Speaks On 3 Capitals And Chandrababbu

అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని అంశంలో తెదేపా అధినేత చంద్రబాబు వైఖరిని సొంతపార్టీ నేతలే వ్యతిరేకించే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన తెదేపా నేతలు సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించడమే దీనికి నిదర్శనమన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పూటకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘రాజధానిలో 30వేల ఎకరాలు ఉందా? రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని గతంలో జగన్‌ చెప్పారు. 30వేల ఎకరాల్లో 15వేల ఎకరాలు రోడ్ల కిందే పోతుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో 60 శాతం రైతులకు ఫ్లాట్ల రూపంలో పోతుంది. ఈ లెక్కన 30వేల ఎకరాల్లో కనీసం 6వేల ఎకరాలు కూడా మిగిలే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇప్పటికే రెండున్నర వేల ఎకరాలు ధారాదత్తం చేశారు. చంద్రబాబు వాదాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన తెదేపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చేయకపోగా.. జగన్‌ చేస్తుంటే అడ్డంపడొద్దని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని పూర్తిగా తీసేస్తున్నట్లు జగన్‌ చెప్పలేదు. అమరావతి, పోలవరం మాత్రమే కడతామని తమకు ప్రజలు ఓట్లేయలేదు’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.