నైమిశారణ్యం మహా పుణ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు నివాస స్థలం అది. పుణ్యమూ, పురాణమూ రెండూ అక్కడే పుట్టాయి. ఒకప్పుడు వెయ్యేళ్ళ దీక్ష చేబట్టి, సత్త్రయాగం చేయాలనుకున్నారు మహర్షులు. నైమిశారణ్యంలో అంతా సమావేశమయ్యారు. సూతుడు అక్కడికి వచ్చాడు. అతను రోమహర్షుణుడి కుమారుడు. పురాణాలు చెప్పడంలో గొప్ప ప్రసిద్ధుడు. వ్యాసుడు తాను రచించిన పురాణేతిహాసాలన్నీ రోమహర్షుణుడికి చెప్పాడు. వాటన్నిటినీ రోమహర్షుణుడు, సూతుడికి చెప్పడంతో అతడు మహా పౌరాణికుడయినాడు.నైమిశానికి విచ్చేసిన సూతుణ్ణి అక్కడి శౌనకాది మునులంతా భక్తితో పూజించి గౌరవించారు.
పురాణాలు చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకు అంగీకరించి, ఆనందంగా తాను నేర్చిన పురాణాలన్నీ వినిపించాడు. వెయ్యేళ్ళ సత్త్రయాగంలో కాలాన్ని దుర్వినియోగం చేయక, మునులంతా సూతుడు చెప్పిన పురాణాలు విని తరించారు. ఇప్పుడు పఠించనున్న భాగవత పురాణం కూడా సూతుడు చెప్పినదే! పురాణాలనీ ఒక ఎత్తయితే, ఈ భాగవతం ఒక్కటీ ఒక ఎత్తు అన్నాడు సూతుడు. దానికి కారణం భగవంతుని లీలలన్నీ ఇందులో పొందుపరచడమేనన్నాడు. ఎన్ని రాసినా మనశ్శాంతి లభించని వ్యాసునికి, ఈ భాగవత రచన మనశ్శాంతి కలిగించడమే దీని గొప్పతనానికి ఉదాహరణ అన్నాడు. ఇంకో విశేషం కూడా తెలియజేశాడతను. వేదాలనూ, మహాభారతంతో పాటు అనేక ఇతిహాసాలనూ శిష్యులకి బోధించిన వ్యాసుడు, ఈ భాగవతాన్ని మాత్రం శిష్యులకి చెప్పలేదు. కుమారుడయిన శుకుడొక్కడికే చెప్పాడు. శుకుడే భాగవతాన్ని అధ్యయనం చేసేందుకు అర్హుడు అనుకున్నాడతను.