తనకు విధించిన మరణశిక్ష, వ్యక్తిగత కక్షసాధింపు చర్య అని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. మంగళవారం ఈ మేరకు కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ముషారఫ్ మొదటిసారి స్పందించారు. ముషారఫ్ సొంత పార్టీ ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ విడుదల చేసిన ఒక వీడియోలో ‘‘ప్రతివాది, అతని తరపు న్యాయవాది స్వీయరక్షణ కోసం మాట్లాడటానికి ఒక్క అవకాశం ఇవ్వకుండా ఇటువంటి తీర్పు ఇచ్చినట్టు (చరిత్రలో) ఒక్క ఉదాహరణ కూడా లేదు. అసలు రాజ్యాంగ ప్రకారం అయితే ఈ కేసును వినాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాపై వ్యక్తిగత కక్ష్యలను మనసులో పెట్టుకున్న కొందరి కోసం ఈ కేసును తీసుకుని విచారణ జరిపారు. ఈ కేసులో ఒకే వ్యక్తిని (తనను) టార్గెట్ చేశారు.’’ అని ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలను విచారించటానికి పాక్ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులు గల ప్రత్యేక కోర్టు బెంచిని ఏర్పాటుచేసింది. జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్, జస్టిస్ షహీద్ కరీమ్, జస్టిస్ నజార్ అక్బర్‌లతో ఏర్పడిన ఈ ప్రత్యేక కోర్టు 167 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. దీనిలో ఆయనకు మరణశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్ చనిపోతే ఏం చేయాలో కూడా చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరాన్ని ఇస్లామాబాద్ లోని డి-చౌక్ వరకూ ఈడ్చుకెళ్లి అక్కడ మూడు రోజుల పాటు వేలాడదీయాలని తన తీర్పులో వివరించింది. అయితే మరణశిక్ష విధిస్తూ వెలువడిన తీర్పును ఆ దేశ మిలిటరీ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. మరణశిక్ష విధించిన నాటినుంచి పర్వేజ్ మద్దతుదారులు దేశమంతా చిన్న స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా తన వెనుక నిలిచిన పాక్ ప్రజలకు, సాయుధ బలగాలకు ముషారఫ్ కృతజ్ఞతలు తెలిపారు. తన భవిష్యత్తును గురించి తన లాయర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. కాగా మరోవైపు, మరణశిక్ష అనంతరం తలెత్తే పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొవాలనే విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కొంత సేపటి క్రితం తన సలహాదారులతో చర్చించారు.
ఈడ్చుకెళ్లి మూడురోజులు వేలాడదీయండి
Related tags :