DailyDose

ఛైర్మన్ పదవి నుండి ఆనంద్ మహీంద్ర నిష్క్రమణ-వాణిజ్యం-12/20

Anand Mahindra Stepping Down As Chairman-Telugu Business News-12/20

* భారత్‌లో విమానయాన సంస్థలు ఎయిర్‌బస్‌ ఏ320 మోడల్‌కు అమర్చిన ఇంజిన్లను మార్చే అంశంపై డీజీసీఏ ఇచ్చిన గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే జనవరి 31వరకు గడువు విధించింది. ఇండిగో, గో ఎయిర్‌కు ఈ గడువు పెంచే అవకాశం ఉంది. భారత్‌లోని ఇండిగో, గోఎయిర్‌ మాత్రమే ఎయిర్‌బస్‌ ఏ320నియో విమానాలను ఉపయోగిస్తున్నాయి. వీటికి ప్రాట్‌ అండ్‌ విట్ని ఇంజిన్లను అమర్చారు. కానీ, ఇంజిన్లలో సమస్యలు వస్తుండటంతో వీటిని మార్చాలని డీజీసీఏ సూచించింది. దీనిపై డీజీసీఏ చీఫ్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది జనవరిలో సమావేశమై పురోగతిపై చర్చిస్తాం’’ అని తెలిపారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ ఏవియేషన్‌ ఏజెన్సీ ఈ వారం మొదట్లో ఎయిర్‌బస్‌ 320ఏ నియోపై హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ప్రాట్‌ అండ్‌ విట్ని ఇంజిన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 2016లో ఈ విమానాలను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వీటికి ఉన్న ఇంజిన్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు ఇంజిన్లు ఒకేసారి పనిచేయకుండా ఉండే ప్రమాదం ఉందని ఫిబ్రవరి 2018లో తొలిసారి హెచ్చరికలు వచ్చాయి. ఇండిగో వద్ద ఉన్న ఏ320, ఏ321 విమానాలు మొత్తం, గోఎయిర్ వద్ద ఉన్న 37 ఏ320 నియోల్లో 13కు ఈ ఇంజన్లు ఉన్నాయి.

* భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వల్ప కాలానికి వ్యయాలను మరింత పెంచితే గానీ మందగమనం నుంచి బయటపడదని అంతర్జాతీయ ద్రవ్య నిధి ముఖ్య ఆర్థిక సలహాదారు గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆదాయాలను పెంచుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

* ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ‘సెబీ మార్గదర్శకాల మేరకు 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆనంద్‌.. మహీంద్రా బోర్డు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉంటారు’ అని సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. కొత్త బాధ్యతల్లో ఆనంద్‌ సంస్థకు ఓ మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నారు.

* భారత్‌ ఆర్థిక మందగమనం నుంచి బయటపడి వేగంగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు దిల్లీలో అసోచామ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్‌లోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందని ఆయన పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. ‘‘భారత్‌ ఇలాంటి ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని నిలబడింది. కష్టమొచ్చిన ప్రతిసారి గతం కంటే బలంగా భారత్‌ పుంజుకొంది. ఈసారి కూడా భారత్‌ బలంగా పైకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాను. గతంలో ఉన్న లోపాలను సరి చేశాం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టండి.. వ్యయాలు పెంచండి.. ముందుకు వెళ్లండి’’ అని మోదీ పేర్కొన్నారు.

* ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో భారత్‌లో విక్రయించే వాహనాల ధరలను జనవరి నుంచి పెంచనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడం ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపడంతో ధరలను పెంచినట్లు రెనో పేర్కొంది. కొత్త మోడల్స్‌ అయిన ట్రైబర్‌, క్విడ్‌లకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. మరోపక్క రెనో విక్రయాలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. గతేడాది నవంబర్‌లో 6,134 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈ సారి నవంబర్‌లో 10,882 యూనిట్లను విక్రయించారు. అక్టోబర్‌లో ఈ కార్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 63శాతం వృద్ధిని నమోదు చేశాయి.

* మార్కెట్ల లాభాల జోరు వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.52గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 95 పాయింట్లు లాభపడి 41,768 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,285 వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఓ దశలో 41,809 మార్క్‌ను తాకిన సెన్సెక్స్‌ సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నెలకొల్పింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.02 వద్ద కొనసాగుతోంది. ఆటో, ఐటీ, ఇంధన రంగ షేర్ల లాభాలతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సైతం మార్కెట్ల సెంటిమెంటును పెంచాయి. అమెరికా-కెనడా-మెక్సికో మధ్య తుది వాణిజ్య ఒప్పందం కుదరడంతో యూఎస్‌ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడం గమనార్హం.