* రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయం-మందడం వై జంక్షన్ వద్ద రాజధాని రైతులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి జీఎన్‌రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారికి అడ్డంగా జేసీబీ పెట్టి…ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సచివాలయం నుంచి జీఎన్ రావు కమిటీని వేరొక మార్గంలో పంపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని రైతులు ఆరోపించారు.
* రాష్ట్ర అభివృద్ధి ఏవిధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, కమిటీ కన్వీనర్ జీఎన్ రావు తెలిపారు. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్ రావు మాట్లాడుతూ… అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా సూచనలు చేయాలని ప్రభుత్వం తమను ఆదేశించిందని చెప్పారు. పరిపాలన పరంగా నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని తాము ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో సూచించామని వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజించాలని పేర్కొంది. ఏపీ రాజధాని ఏదని అడిగిన ప్రశ్నకు నిపుణుల కమిటీ స్పష్టత ఇవ్వలేదు. రాజధాని ఏదని చెప్పడం తమపని కాదని కమిటీ పేర్కొంది. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన భూమి ఇవ్వాలని సూచించింది. అమరావతి, మంగళగిరి కాంప్లెక్సుకు సంబంధించి, విశాఖ మెట్రో సిటీకి సంబంధించి, కర్నూలు, రాయలసీమకు సంబంధించి మూడు కీలకమైన ప్రతిపాదనలు చేసింది. అమరావతి పరిధిలో హైకోర్టు బెంచ్‌తో పాటు అసెంబ్లీ , ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్ నివాస భవనం ఉండాలని సిఫార్సు చేసింది. విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొంది. విశాఖలో అసెంబ్లీ వేసవికాల సమావేశాల నిర్వహించాలని సిఫార్సు చేసింది. కర్నూలులో హైకోర్టు, దానికి సంబంధించిన కోర్టులన్నీ రాయలసీమం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. 10,600 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాజధాని అభివృద్ధితో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన 125 పేజీల నివేదికను సీఎంకు సమర్పించినట్టు కమిటీ వెల్లడించింది. రాష్ట్రంలో సమతూకంగా అభివృద్ధి జరగాలన్న అంశంతోనే ప్రధానంగా తాము నివేదిక రూపొందించినట్టు జీఎన్‌రావు కమిటీ స్పష్టం చేసింది.
* రాజధాని రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం కాపాడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్ ద్వారా తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రైతులకు ఫ్లాట్ల రూపంలో ఇస్తామన్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 27న కేబినెట్ భేటీలో చర్చించిన నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిపుణుల కమిటీ నివేదికతో ప్రభుత్వం ఏకీభవిస్తుందనే అనుకుంటున్నానని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
* టెలికాం రంగంలో వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ అన్నారు. వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ-ఆర్పు) రూ.300కి చేరాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న టెలికాం రంగం పునరుత్తేజానికి ఇది అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికీ దేశానికి చెందిన మొబైల్ వినియోగదారులు తక్కువ ధరకే సేవలు పొందుతున్నారని, భవిష్యత్‌లోనూ అదే తరహాలో సేవలు పొందేందుకు ఇష్టపడతారని మిత్తల్ అన్నారు.
* ఝార్ఖండ్‌లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు చివరిదైన ఐదో దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం నిర్వహించగా.. సాయంత్రం ఐదు గంటల వరకు 70.83 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగిలిన చోట్ల 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశరాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు మరోసారి లాఠీలు ఝుళిపించారు. మరోవైపు పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. యూపీలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. దిల్లీలోని జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ఆందోళనకారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ తలపెట్టారు. దిల్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
* సెలక్టర్లను ఎంపిక చేసేందుకు క్రికెట్ సలహా సంఘాన్ని వారం రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. నూతన సెలక్షన్ కమిటీ పదవీకాలం మూడేళ్ల వరకే ఉంటుందని వెల్లడించారు. కోచ్ ఎంపిక లేదు కాబట్టి సెలక్టర్లను ఎంపిక చేసేందుకు కేవలం ఒక సమావేశమే ఉంటుందని ఆయన తెలిపారు. చివరి సారిగా కపిల్‌దేవ్ నేతృత్వంలో సలహా సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో కమిటీని నియమిస్తాం. ప్రధాన కోచ్ ఎంపిక ఇప్పటికే పూర్తయింది కాబట్టి సెలక్టర్లను ఎంపిక చేసేందుకు సీఏసీ ఒక్కసారే సమావేశం అవుతుంది’ అని దాదా అన్నారు.
* రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 2008 నాటి బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. నలుగురు దోషులు సర్వార్ అజామీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్, సల్మాన్‌లకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో వీరిని దోషులుగా తేలుస్తూ గత బుధవారం జైపూర్ కోర్టు తీర్పు చెప్పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.
* జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ)ని రాష్ట్రంలో అమలు చేయబోమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టంచేశారు. పార్లమెంట్లో పౌరసత్వ చట్టానికి మద్దతు తెలిపిన ఆ పార్టీ విషయంలో ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ ఆయన ఎన్ఆర్సీ విషయంలో తన వైఖరిని తెలియజేయడం గమనార్హం. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో నితీశ్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
* ‘హీ ఈజ్ సో క్యూట్, హీ ఈజ్ సో స్వీట్..’ అని మహేశ్‌బాబును ఉద్దేశిస్తూ గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ‘షీ ఈజ్ సో క్యూట్..’ అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. మహేశ్ కుమార్తె సితార ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఈ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది. కథానాయిక రష్మిక స్టెప్పులు కాపీ చేసి.. అచ్చం అలానే వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాప డ్యాన్సింగ్ నైపుణ్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
* రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు చెబితేనే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరిగే పరిస్థితి నెలకొందన్నారు.‘‘పోలీసు వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలి. ఎస్సీలకు అన్యాయం జరిగినట్లు భావిస్తే అందరికీ సమన్యాయం చేయాలి’’ అని చెప్పారు.
* రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ.. సీఎం జగన్‌కు తుది నివేదికను అందజేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సమావేశమై నివేదికను అందించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. రాజధానిపై జరిపిన అధ్యయనంపై ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేయగా.. తాజాగా తుది నివేదికను సమర్పించింది.
* ‘దిశ’ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిస్తామని.. దిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. రేపు ఉదయం 10.30గంటల్లోపు అభిప్రాయం తెలపాలని ఆదేశించింది.
* ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన భాజపా మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు శిక్ష ఖరారైంది. సెంగార్‌కు జీవితఖైదు విధిస్తూ దిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం, విచారణ ఖర్చుల నిమిత్తం రూ.15లక్షలు చెల్లించాలని కోర్టు సెంగార్‌ను ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి సెంగార్ నుంచి ఏమైనా ముప్పు ఉందేమో సమీక్షించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబానికి సురక్షితమైన నివాసం కల్పించే బాధ్యతను కూడా న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది.
* పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు వారు చెబుతున్నారు. నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు సంయుక్తంగా ‘డాల్ఫిన్స్ నోస్’ పేరిట ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను ఛేదించాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
* పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం మంజూరైంది. గుజరాత్‌లోని భాన్వాడ్ తాలూకాలో పుట్టిపెరిగిన హసీనా బెన్ అనే మహిళ 1999లో వివాహానంతరం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి పౌరసత్వాన్ని స్వీకరించింది. తన భర్త మరణించటంతో భారత్‌కు తిరిగి రావాలని హసీనా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల క్రితం భారత పౌరసత్వం కోరుతూ వ్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
* పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సమకాలీన అంశాలతో పాటు, మానవీయ కోణంలో ఉన్న విభిన్న కథనాలు, వీడియోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలా ఆయన షేర్ చేసిన ఎన్నో రకాల వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్రక్ హారన్ సౌండ్‌ను తన గొంతుతో అనుకరిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు.
* శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేటకు వచ్చారు. అక్కడ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. 21, 22 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారు. ఆయన గౌరవార్థం గవర్నర్ 22న రాత్రి రాజ్‌భవన్‌లో విందును ఏర్పాటు చేశారు. 23 నుంచి 26 వరకు రాష్ట్రపతి చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో పర్యటిస్తారు.
* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరగాలని చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. తాను ఒపీనియన్ పోల్ మాత్రమే నిర్వహించాలని కోరానని చెప్పుకొచ్చారు. సీఏఏని నిరసిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో గురువారం మాట్లాడుతూ.. ‘‘భాజపాకు సత్తా ఉంటే.. సీఏఏ, ఎన్ఆర్సీపై యూఎన్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ఆ ఓటింగ్‌లో భాజపా ఓడిపోతే ప్రభుత్వం గద్దె దిగాలి’’ అని వ్యాఖ్యానించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పించింది. ఐక్యరాజ్యసమితి జోక్యం కోరడంపై మండిపడింది.
* దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండ, విదేశీ పెట్టుబడుల వెల్లువతో నేటి ట్రేడింగ్‌ను కొత్త జీవనకాల గరిష్ఠాలతో ప్రారంభించిన సూచీలు ఆ తర్వాత నెమ్మదించాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు లాభాలను కోల్పోయాయి. అయితే సరికొత్త రికార్డుల్లో ముగిశాయి.