Sports

సోదరుడికి సలహాలు

Irfan Pathan Soothes Yousuf Pathan With Words

కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో భారత ఆటగాడు యూసుఫ్‌ పఠాన్‌కు నిరాశే మిగిలింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వదులుకోవడంతో వేలంలో రూ.కోటీ కనీస ధరతో వచ్చిన అతడిపై ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. దీనిపై అతడి సోదరడు, భారత ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. ఐపీఎల్‌ వేలంలో చుక్కెదురైనంత మాత్రాన కెరీర్‌ అయిపోలేదని యూసుఫ్‌కు ధైర్యం చెప్పాడు. ‘‘చిన్న చిన్న ఎక్కిళ్లు నీ జీవితాన్ని నిర్వచించవు. నువ్వో అద్భుతం. అసలైన మ్యాచ్‌ విజేతవి. లవ్‌ యూ లాలా..’’ అని ట్వీట్‌ చేశాడు. తొలి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టైటిల్‌ గెలవడంలో యూసుఫ్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతడు 174 మ్యాచ్‌లు ఆడాడు. 142.97 స్ట్రైక్‌రేటుతో 3,204 పరుగులు చేశాడు. అంతేకాక 42 వికెట్లు పడగొట్టాడు. ఈ వేలంలో భారత ఆటగాళ్లు చతేశ్వర్‌ పుజారా, స్టువర్ట్‌ బిన్నీ, హనుమ విహారి, మనోజ్‌ తివారీ, నమన్‌ ఓజా, బరిందర్‌ స్రాన్‌‌, మోహిత్‌ శర్మ వేలంలో అమ్ముడుపోలేదు. వారితో పాటు విదేశీ ఆటగాళ్లు మార్టిన్‌ గప్తిల్‌, కుశాల్‌ పెరీరా, ఎవిన్‌ లూయిస్‌, షై హోప్‌, సౌథీ, ముస్తాఫిజుర్‌, ఆండ్రూ టై, జేసన్ హోల్డర్‌, గ్రాండ్‌హోమ్‌, బెన్ కటింగ్‌, హేడెన్‌ వాల్ష్‌, బ్రాత్‌వైట్‌, జోసెఫ్‌, ఆడమ్‌ జంపాను ఏ ఫ్రాంఛైజీ దక్కించుకోలేదు.