కాలాన్ని శాసించే కాలభైరవుడంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. అష్టరూపాల (కాల, అసితాంగ, సంహార, రురు, క్రోధ, కపాల, రుద్ర, ఉన్మత్త)తో దుష్టశిక్షణే ధ్యేయంగా అవతరించిన మహాశివుని క్రోధాంశ స్వరూపం ఆయనది. సమస్త సృష్టి అంతటా వ్యాపించిన కాలం కలిసి రావడానికి ఎంతటి వారికైనా కాలుని అనుగ్రహం తప్పనిసరి. ఆయనది చూడడానికి ఉగ్రరూపమే అయినా భక్తులకోసం ప్రశాంత హృదయాన్ని ప్రదర్శించే స్వభావమని వేదపండితులు చెప్తారు. వచ్చే ‘కాలభైరవాష్టమి’ సందర్భంగా ఈ స్వామిని ఆరాధించడం అంటే సమస్త కాలాన్ని కొలవడమే. ‘ప్రకృతి-శక్తి’నే పరమాత్మ ప్రతీకగా భావించే వైదిక సంస్కృతిలోని ఉత్తమ సంస్కారాలలో కాలభైరవ పూజ ఒకటి. కాలభైరవునికి పైన పేర్కొన్నవేకాక మరిన్ని (భీషణ, స్వర్ణాకర్షణ, శంబర, మహా, చండ) వంటి రూపాలూ ఉన్నట్లు వివిధ ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. సిరిసంపదల నుంచి మోక్షం వరకూ అన్నింటినీ ప్రసాదించే అత్యంత శక్తివంతమైన దైవం కాలభైరవుడు! మృత్యుభయాన్ని తొలగిస్తూనే స్వర్గతుల్యమైన పరమేశ్వర కటాక్షాన్ని అందించే ఈ అపురూప ఆరాధనను అందరం సద్వినియోగం చేసుకొందాం.
కాలభైరవాష్టమి
Related tags :