Movies

ఫోర్బ్స్‌కు రంగోలీ ఛాలెంజ్

Rangoli Ranaut Challenges Forbes Magazine Over Actors Earnings

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌కి ఛాలెంజ్ విసిరారు. భారత్‌లో 2019కి సంబంధించి అత్యధికంగా ఆర్జించిన వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో విరాట్‌ అగ్రస్థానంలో ఉండగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌, అక్షయ్‌ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ 70వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే తాజాగా ఫోర్బ్స్‌ జాబితాపై రంగోలీ స్పందించారు. సెలబ్రిటీల ఆర్జనపై మ్యాగజైన్‌లో ప్రచురించిన దానిని నిరూపించాలని ఛాలెంజ్‌ చేశారు. ఈ మేరకు రంగోలీ సోషల్‌మీడియా వేదికగా ఫోర్బ్స్‌ సంస్థను ట్యాగ్‌ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ‘‘ఫోర్బ్స్‌ ఇండియా’ ప్రకటించిన జాబితా మోసపూరితమైనది. వాళ్ల మ్యాగజైన్‌లో ప్రచురించిన సెలబ్రిటీల ఆదాయం నిజమేనని నిరూపించండి. ఇదే నా ఛాలెంజ్‌. కంగన తనకి వచ్చే మొత్తం ఆదాయం కంటే పన్నునే ఎక్కువ కుడుతోంది. సెలబ్రిటీల ఆదాయంతోపాటు ఎవరెవరూ ఎంత పన్ను చెల్లిస్తున్నారో మాకు తెలియజేయండి. దేనిని ఆధారంగా చేసుకుని సెలబ్రిటీల ఆదాయాన్ని ప్రకటిస్తున్నారో వివరించండి. అసలు ఈ ఏడాది కంగనకు ఎంత ఆదాయం వచ్చిందో నాకు, తన అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి మాత్రమే తెలుసు. కంగనకు కూడా తెలియదు. మేమే తనకి చెప్తాం. చాలా రహస్యంగా ఉంచుతాం. ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కాకుండానే మీకు ఈ విషయాలు ఎలా తెలిశాయి?మీకు ఇంతటి సమాచారాన్ని అందించిన ఆ సోర్స్‌ ఎవరో నాకు చెప్పండి’ అని రంగోలీ ట్వీట్‌ చేశారు.