భాగవతం రచించమని చెప్పినప్పుడే వ్యాసునికి భక్తితత్త్వం గురించి కూడా చెప్పాడు నారదుడు. అన్నిటి కంటే అది గొప్పదని వివరించాడు. హరి భక్తుడు కర్మానుసారంగా నీచ జన్మ ఎత్తినప్పటికీ, సంసార బంధంలో చిక్కుకోడనీ, త్వరలోనే అతను ఉత్తమపదాన్ని అందుకుంటాడన్నాడు. ఉదాహరణగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు నారదుడు.గత జన్మలో నారదుడు ఓ దాసీ పుత్రుడు. అతని తల్లి ఓ బ్రాహ్మణుని ఇంట పనిమనిషిగా ఉండేది. తల్లి పనిమనిషి అయితేనేం? నారదుడు చిన్నతనం నుంచే సన్యాసుల్ని ఆదరించి, వారికి ఏ లోటూ రాకుండా చూసుకునేవాడు. గురుభక్తి, భగవద్భక్తి, మితభాషణ, సదాచారం సకల సద్గుణాలన్నీ చిన్నతనంలోనే అలవడినాయి అతనికి.
మహాత్ములను సేవిస్తూ, వారి ఎంగిలి తిని పెరిగాడు నారదుడు. అలా పెరిగిన కారణంగా అతనికి చిత్తశుద్ధి కలిగింది. మనసులో అనునిత్యం హరిని జపించసాగాడు. విష్ణుకథలు వినసాగాడు. విష్ణువు పట్ల ఎనలేని భక్తిని కనబరిచిన నారదునికి సన్యాసులు పరమేశ్వర తత్త్వాన్ని బోధించారు. ఆనాటి నుంచి నారదుడు భగవద్భక్తుడయినాడు.తల్లికివేవీ తెలియవు. అమాయకురాలు. నారదుడు ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ అతని గురించి పెద్దగా పట్టించుకునేది కాదామె. ఓ రాత్రి ఇంటికి రాని ఆవును వెతుక్కుంటూ బయల్దేరిందామె. కొండలెక్కుతూ దిగుతూ నడచి నడచి అలసిపోయింది. ఆ అలసటలో కాళ్ళు తడబడ్డాయి. చూసుకోలేదు, నిద్రపోతున్న పాము మీద కాలు వేసింది. అంతే! కాటు వేసింది పాము. చనిపోయిందామె. అప్పటికి నారదుడికి అయిదేళ్ళు. తల్లి పోయిందన్న బాధే లేదతనికి. దానికి కారణం, అతను సన్యాసం స్వీకరించాలనుకోవడమే! ఉన్న ఒక్కగానొక్క బంధమూ తెగిపోవడంతో తనకి మంచే జరిగిందనుకున్నాడు నారదుడు. సన్యాసం స్వీకరించాడు. అరణ్యాలు, కొండలు, కోనలూ దాటాడు. ఆకలిదప్పులు బాధిస్తున్నా, అలసిపోతున్నా అతను హరినామస్మరణ మానలేదు.నడచి నడచి ఆఖరికి ఓ నది ఒడ్డుకు చేరుకున్నాడు నారదుడు. ఇక నడవలేననుకున్నాడు. నదిలో స్నానం చేశాడు. భగవంతునికి అర్ఘ్యం ఇచ్చి, కడుపునిండా నీరు తాగాడు. దాహాన్ని తీర్చుకున్నాడు. తీరానికి చేరి, రావిచెట్టు కింద కూర్చున్నాడు. మనసులో మహావిష్ణువును తలచుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. ధ్యానించసాగాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే మరుక్షణంలోనే అదృశ్యమయ్యాడు. ఏకకాలంలో సంతోషం, దు:ఖం రెండూ కలిగాయి నారదునికి. అయినా హరినామస్మరణ మానలేదు. అప్పుడు భగవంతుని గొంతు వినవచ్చిందిలా.‘‘బాలకా! నువ్వు నన్ను ఈ జన్మలో తినివితీరా చూడలేవు. నీ భక్తికి మెచ్చి క్షణ మాత్రమే నా దివ్య మంగళ రూపాన్ని చూపించాను. త్వరలోనే నువ్వు నీ దాసీపుత్ర దేహాన్ని త్యజిస్తావు. అప్పుడు నా చెంతనే ఉంటావు. నా పట్ల నీ భక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండేట్లుగా వరమిస్తున్నాను, స్వీకరించు. అలాగే ప్రళయకాలంలో కూడా నీ స్మృతి పోదు’’.శ్రీహరి కరుణకు పొంగిపోయాడు నారదుడు. కొంత కాలానికి దేహాన్ని విడిచాడు.
కల్పాంతాన లోకాలన్నీ జలమయమయిపోయాయి. నీరంతా ఒకే సముద్రంగా ఉంది. ఆ సముద్రంలో శ్రీహరి శయనించి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి గర్భంలోకి బ్రహ్మదేవుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూ నిశ్వసించాడతను. అలా ఊపిరి వదిలే వేళ బ్రహ్మదేవుని గర్భంలో జొరుకున్నాడు నారదుడు.
అనేక యుగాలు గడిచిపోయాయి.
బ్రహ్మ మళ్ళీ సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మదేవుని ప్రాణాల నుండి మరీచి మొదలయిన ప్రజాపతులు జన్మించారు. వారితో పాటు నారదుడు కూడా జన్మించాడు. శ్రీహరి అనుగ్రహంతో నారదునికి దివ్యదేహం ప్రాప్తించింది. దేవదత్తం, మహతి అనే వీణ కూడా లభించాయతనికి. సర్వజ్ఞత ్వం, చిరంజీవత్వం సంప్రాప్తించాయి. దాంతో నిరంతరం హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలూ సంచరించసాగాడు నారదుడు.