అపజయాలు, అవరోధాలు మనిషికి కొత్త కాదు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు వరసలో వచ్చి నిలబడేవి అవే. ఎవరైనా సరే- వాటి ముఖం చూడకుండానే కొండ శిఖరం చేరిపోతామనడం తెలివితక్కువతనం.
ఇవి ఎప్పుడొస్తాయి, ఎలా వస్తాయని తెలుసుకోవడం ముఖ్యం. విజయం బాట పట్టేటప్పుడు ఇవి ఎటునుంచి అయినా రావచ్ఛు తయారుగా ఉండాలి. తడబడకూడదు. తల్లడిల్లిపోకూడదు.
మన దగ్గర సరైన జ్ఞానం లేనప్పుడు అపజయాలు, అవరోధాలు మనల్ని ఏడిపిస్తాయి. సమయస్ఫూర్తి, చాకచక్యం, నిపుణత, సానుకూలమైన ఆలోచనలు లేకపోతే అవి మనల్ని గాలిలో గడ్డిపరక లాగా ఎగరగొట్టేస్తాయి.
ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. విజయం కోసం పరుగు తీస్తున్నప్పుడు దాని చరిత్ర మనకు తెలియాలి. దాని సాంకేతిక రహస్యాలు మనకు క్షుణ్నంగా తెలిసి ఉండాలి. తప్పదు. లేకపోతే అపజయాలు, అవరోధాలు చిక్కుముడులు వేస్తుంటాయి. విజయాన్ని తెచ్చి ఎవరూ చేతిలో పెట్టరు. సాధించుకోవాలి. దాని కోసమే మనం పుట్టాం.
గెలుపు సూత్రాలు, అవి పనిచేసే విధానం, పని చెయ్యకుండా ఉండే స్థితిగతులు… అన్నీ జ్ఞానం రూపంలో మన మనసులో ఉండాలి. ఒక నిర్ణయం ప్రకారమే వర్షకాలం తరవాత లంకకు సీతాన్వేషణకై బయలుదేరాలని పథకం సిద్ధమైంది. ఎవరు బయలుదేరాలన్న ప్రశ్న ఉదయించింది. సర్వ సమర్థుడు హనుమంతుడని ఏకగ్రీవంగా తేల్చారు. అప్పుడు లంకాయానం మొదలైంది.
శ్రీరాముడి ఆశీస్సులతోపాటు హనుమంతుడి బుద్ధిబలం, వేగం, మెరుపులు కురిపించే చాకచక్యం- అపజయాలను, అవరోధాలను తునాతునకలు చేసేశాయి.
ఏయే దిక్కుల్లో ఏమున్నాయో ఆంజనేయుడు సమగ్ర అధ్యయనం చేసి ప్రయాణం మొదలుపెట్టాడు. గొప్ప అవగాహనతో ముందుకు కదిలాడు. సంపూర్ణ జ్ఞానంతో దూసుకుపోయాడు.
పుటం పెడితే బంగారం నిగ్గు తేలుతుంది. అపజయాలు, అవరోధాలు లేకపోతే మన గొప్పతనం ఏముంటుంది? విజయాన్ని ఆనందించాలంటే, ఎన్ని మెట్లెక్కి అక్కడకు చేరామన్నది ముఖ్యం. ఎంత బాధపడి, వేదనకు గురయ్యామన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం.
పాండవులను అడుగడుగునా ప్రయత్నపూర్వకంగా బాధలకు గురిచేశాడు దుర్యోధనుడు. వాళ్లు అధైర్యపడలేదు. నిత్యం శ్రీకృష్ణుడి దివ్యశక్తిని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ జ్ఞానం ఇచ్చిన ధైర్యంతోనే కాలం వెళ్లబుచ్చారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం రెండూ పూర్తిచేశారు.
అవరోధాలు, అడ్డంకులు మైలురాళ్లుగా నిలుస్తాయి. అపజయాలు చివరికి పూలవర్షంగా మారిపోతాయి. నమ్మకం ఉన్నా సంపూర్ణమైన ఎరుకతో కూడిన శుద్ధజ్ఞానం ఉండాలి. అది ప్రహ్లాదుడిని ఆపదల నుంచి రక్షించిన దైవశక్తి లాగా సహాయం చేస్తుంది. అందులో సందేహం లేదు.
ఎవరెన్ని చెప్పినా శ్రీహరే విశ్వానికి అంతరాత్మ అన్నమాటను విడిచిపెట్టలేదు ప్రహ్లాదుడు. ఆ బాలుడు భక్తుల చరిత్రను సమూలంగా మార్చిపారేశాడు. భగవంతుణ్ని భూమ్మీదకు రప్పించి చూపించాడు. అటువంటి భక్తుడికి, మహాజ్ఞానికి అపజయాలు, అవరోధాలు పాదాక్రాంతమైపోయాయి.
‘లే… విజయం సాధించు! ఈ జ్ఞానంతో విజయం నీదే!’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఆచంద్రతారార్కం వినిపిస్తూనే ఉంటాయి.