* ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి షాక్ తగలనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రిలయన్స్ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్‌కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది. మార్కెట్ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
* దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దీర్ఘకాలిక మందగమనం రానున్న ఆటో ఎక్స్‌పోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అట్టహాసంగా జరగనున్న ఈ ఎక్స్‌పోలో దేశీయ కంపెనీలతోపాటు, డజనుకుపైగా కంపెనీలు పాలు పంచుకోవడం లేదు. మరోవైపు ఆటో ఎక్స్‌పో 2020 లో పాల్గొనకపోడానికి ఆయా కంపెనీలకు వారి వారి సొంత కారణాలున్నప్పటికీ, ఈవెంట్ విజయవంతమవుతుందని పరిశ్రమల బాడీ సియామ్ ఆశాభావం వ‍్యక్తం చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్ వంటి తోపాటు సహా డజనుకు పైగా వాహన తయారీదారులు ఆటోఎక్స్‌పో-2020 కు దూరంగా ఉండనున్నాయి. వీటితోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈవెంట్‌కు గతంలో కూడా డుమ్మాకొట్టాయి.
* జెట్ ఎయిర్‌వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం.
* ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిరర్ధక ఆస్తుల ఒత్తిడి నుంచి బ్యాంకుల పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజ్‌నీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాక, రుణాలు ఇచ్చేందుకు వ్యవస్థలో ఎలాంటి ద్రవ్య కొరత లేదన్నారు. దిల్లీలో శనివారం జరిగిన ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు.