ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2,15,000 మందిని పొట్టనపెట్టుకుంటున్న ‘రోటా వైరస్’ దాడి రహస్యం వెల్లడైంది. ఇది ఇన్‌ఫెక్షన్‌గా మారడానికి శరీరం ఎందుకు సహకరిస్తోందన్న చిక్కుముడి వీడిపోయింది. కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని ఛేదించారు.పేగుల్లో అత్యంత సహజంగా జరిగే ‘లింటోటాక్సిన్ పాత్‌వే’ రసాయన ప్రక్రియ… రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకల్లో ఈ ప్రక్రియను నిలిపివేశారు. పర్యవసానంగా వాటిలోని యాంటీబాడీలు రోటా వైరస్‌కు ప్రతి స్పందించడం మానేశాయి. ఈ వైరస్‌ను ఎదుర్కొనే ‘ఇమ్యునోగ్లోబులిన్-ఎ’ అనే యాంటీబాడీల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. అయితే ఇక్కడో గమ్మత్తయిన విషయం బయటపడింది. ఈ నిరోధక ప్రక్రియ ఫలితంగా పేగుల్లోని కణాల (మెసెంటెరిక్ లింప్ నోడ్ స్ట్రోమల్ సెల్స్)పైనా ప్రభావం చూపినట్టు తేలింది. ఈ స్ట్రోమల్ సెల్స్… ఇమ్యునోగ్లోబులిన్-ఎ ఉత్పత్తికి దోహదపడే ఇమ్యూన్-బి సెల్స్ పనితీరును మందగింపజేస్తున్నట్టు గుర్తించారు. స్ట్రోమల్ సెల్స్‌ను బలోపేతం చేయడం ద్వారా… ఇమ్యూన్-బి సెల్స్ పనితీరు మెరుగుపడి ఇమ్యునోగ్లోబులిన్-ఎ ఉత్పత్తి ఇతోధికంగా సాగుతుందని, తద్వారా రోటావైరస్‌ను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతమవుతుందని పరిశోధనకర్త గొమెర్మాన్ విశ్లేషించారు. గర్భిణులు, వారికి పుట్టబోయే బిడ్డలను మరణ ముప్పు నుంచి తప్పించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైన్స్ ఇమ్యునాలజీ’ పత్రిక ఈ వివరాలను అందించింది
రోటావైరస్ చిక్కుముడి వీడింది
Related tags :