Kids

మంచీ చెడు ఆలోచించాలి-తెలుగు చిన్నారుల కథలు

Think before acting-Telugu kids moral stories

ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు..ఆయన ఉదయాన్నే లేచి నదివద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు..ఇదీ అతని దినచర్య…

ఒక రోజు ఆయన తన దినచర్య మొదలుపెట్టటానికి నది వద్దకు వెళ్ళగా..అక్కడ ఆయన కళ్ళకు కనపడింది ఏమిటంటే…ఒక మత్స్యకారుడు ఒక మహిళ ఒడిలో తల పెట్టుకుని నిద్ర పోతున్నాడు..అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది..సాధువుకి అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి..ఒక రోజుని మొదలుపెట్టాలంటే మంచిపనులతో మంచిగా మొదలుపెట్టాలి…అంతేకానీ..ఈ మనిషి ఎంత పాపిష్టివాడు, మహాపాపి…ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు…బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుని…సరే నాకెందుకులే అనుకుని…తన స్నానం, ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు…

సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకుని భగవన్నామస్మరణ చేసుకుంటుండగా…ఒక శబ్దం వినిపించింది….కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు…ఏమిటా ఆ అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా…నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు…సాధువు ఏమి చెయ్యాలో ఆలోచించేలోపే మహిళ వళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి, పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకి తెచ్చాడు…మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్ధం అయి సాధువు సంతోషపడ్డాడు…

కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్యపోయాడు, అయోమయం పడుతున్నాడు..ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను, ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు..మంచివాడు అనిపిస్తున్నాడు..ఇతను మంచివాడా, చెడ్డవాడా అని అర్ధం కాక అతని వద్దకే వెళ్ళి అడిగారు…నువ్వు ఒకరిని కాపాడి చాలా మంచిపని చేసావు…కానీ ఇందాకా నువ్వున్న పరిస్థితిలో…నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది…అని తన మనసులో మాట బయటపెట్టాడు…అప్పుడు ఆ మనిషి చెప్పాడు…స్వామీ..నేను చాలారోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను…నేనొచ్చే సమయానికి మా అమ్మ నాకోసం భోజనం, నీరు తీసుకొచ్చింది…హాయిగా మా అమ్మ కమ్మటి చేతిభోజనం కడుపునిండా తినేసి, మంచినీళ్ళు తాగాను…చల్లటి ఉదయంవేళ హాయైన గాలి..కడుపునిండా తిన్న భోజనం..నాకున్న అలసటకి నిద్ర వచ్చేసింది…మా అమ్మ వడిలో తలవాల్చి కంటినిండా నిద్రపోయాను…హాయిగా మంచినిద్ర పోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు…మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటీ అనడిగాడు సాధువు…ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు…ఓ అదా..నాకు మంచినీరు తేవటానికి ఏదీ దొరక్క మా అమ్మ ఆ సీసాలో నీళ్ళు తెచ్చింది అంతే…అన్నాడు..అది విన్న సాధువుకి తాను ఇంతకుముందు ఈ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో…అని అనుకుని కొంచెం బాధనిపించి కళ్ళు తడి అయ్యాయి…మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకుని…ఇంకెప్పుడూ తొందరపడి ఎవరిగురించీ ఏ అభిప్రాయమూ ఏర్పరుచుకోకూడదు..అని ఒక కొత్తపాఠం నేర్చుకున్నాడు..

అంతేకదా మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టికోణంలో తలా ఒక రకంగా ఊహించేసుకుంటాము…అందులో నిజం ఏంటి, అబద్ధం/భ్రమ ఏంటీ అనేది అవసరం అని చూసుకోము…దానివల్ల కొంతమంది అమాయకులు ఎంత బలి అవుతారో అని అంచనా కూడా వేయరు చాలామంది…చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు…ఒకటి అనే అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచీచెడు ఆలోచిస్తే బావుంటుంది.