నాణ్యమైన విద్యయే ప్రభుత్వ లక్ష్యం
విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ప్రభుత్వ సాయం
విదేశీ విద్యపై అవగాహనకు జిల్లాల వారీగా సదస్సులు
వచ్చే మూడేళ్ళలో జంట నగరాలకు నిరంతరంగా నీటి సరఫరా
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
ఆటా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో విద్యా సదస్సు
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్ లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన విద్యా సదస్సుకు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
పేదలు విదేశాల్లో విద్యను అభ్యషించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
విదేశాల్లో విద్యను అభ్యషించాలని అనుకునే విద్యార్థులు యూనివర్సిటీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విదేశాల్లో చదువుకున్న తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి సొంత రాష్ట్రానికి సేవలు అందించాలని వినోద్ కుమార్ అన్నారు.
విదేశీ విద్యపై అవగాహన కల్పించేందుకు జిల్లాల్లో కూడా విద్యా సదస్సులు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
పార్లమెంట్ లో వచ్చే బడ్జెట్ సమావేశాలలో నూతన విద్యా విధానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణ లో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు కావడం ఖాయమని వినోద్ కుమార్ వివరించారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిందని, అందులో ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయని ఆయన అన్నారు.
భవిష్యత్ తరాల కోసమే తెలంగాణ స్వరాష్ట్రను సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
వచ్చే రెండు, మూడు ఏళ్లలో హైదరాబాద్ జంట నగరాలకు 24 గంటల మంచినీటి సరఫరా కు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
త్వరలోనే కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సదస్సులో అమెరికా కాన్సులేట్ హెడ్ ఎరిక్ అలెక్ జండర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లు వెంకట రమణ, లింబాద్రి, ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, కాబోయే అధ్యక్షుడు భువనేశ్ భుజాల, ప్రతినిధులు రాజశేఖర్, జయదేవ్, ఉల్ ఉలూమ్ విద్యా సొసైటీ కార్యదర్శి జాఫర్ జావిద్, తదితరులు పాల్గొన్నారు.