భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్‌లో అధికారం కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసి రాజని జేఎంఎం-కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 81 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ (41)ని దాటుకుని 47 సీట్లు (ఆధిక్యం+విజయం) సాధించింది. అధికారంలో ఉన్న భాజపా కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. జేవీఎం 3, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4స్థానాలకు పరిమితమయ్యారు. సీఎం రఘుబర్ దాస్ ఓటమి పాలవ్వగా.. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి హేమంత్ సొరెన్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. రఘుబర్ దాస్ కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఈ సారి భాజపా ఒంటరిగా పోటీచేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు ఏజేఎస్‌యూతో కలిసి పోటీ చేసిన కమలనాథులు.. ఈసారి ఆ పార్టీతో సీట్ల పంపకాల విషయంలో పొరపొచ్చాలు రావడంతో వేర్వేరుగానే బరిలో దిగారు. మరోవైపు జేఎంఎం (43), కాంగ్రెస్ (31), ఆర్జేడీ (7) సీట్లలో కూటమిగా పోటీచేశాయి. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరెన్ సీఎం అభ్యర్థిగా రెండు చోట్ల (బర్హిత్, దుమ్కా)లో పోటీచేసి విజయం సాధించారు. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసిన సీఎం రఘుబర్ దాస్ గతంలో ఆయన మంత్రివర్గ సహచరుడిగా పనిచేసి ఈ సారి సీటు కేటాయించకపోవడంతో బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీచేసిన సరయి రాయ్ చేతిలో 8 వేల ఓట్ల తేడాతో పరాజయంపాలయ్యారు. 2014తో పోలిస్తే పోలిస్తే ఈ ఎన్నికల్లో విపక్షాలు బలపడ్డాయి. జేఎంఎం 2014లో 19 స్థానాలు సాధించగా.. ఈ సారి 30 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 6 స్థానాల నుంచి 16 స్థానాలకు ఎగబాకింది. అదే సమయంలో భాజపా 37 స్థానాల నుంచి 25 స్థానాలకు పడిపోయింది. జేవీఎం 8 స్థానాల నుంచి 3 కు, ఏజేఎస్‌యూ 5 నుంచి 2 స్థానాలకు పడిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారం చేపట్టింది. అయితే, ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం గమనార్హం. తొలుత మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికలు జరిగాయి. హరియాణాలో అనుకున్న మెజారిటీ రాకపోయినప్పటికీ జేజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో మాత్రం శివసేనతో విభేదాలతో అధికారానికి దూరమైంది. తాజాగా ఝార్ఖండ్ సైతం చేజారింది. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఝార్ఖండ్‌లో 55 శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత ఎన్నికల్లో 33 శాతానికే పరిమితమవ్వడం గమనార్హం. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం, ఆయోధ్య రామ మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం వంటి అంశాలన్నీ భాజపాకు సానుకూల అంశాలే అయినా ఆ పార్టీ ఝార్ఖండ్‌లో ఎదురుగాలి వీయడం గమనార్హం.
ఝార్ఖండ్ పీఠం కాంగ్రెస్ కూటమిదే
Related tags :