భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ ఆహార ధరలను సవరించింది. రైల్వేస్టేషన్లలో ఆహారశాలల్లో ఈ ధరల మార్పు వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీకి చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. ‘‘రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆహారశాలల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది’’ అని దానిలో వెల్లడించింది. అంటే జనాహార్, రిఫ్రెష్‌మెంట్ రూమ్స్ వంటి వాటికి ఇది వర్తించనుంది.
మెనుకు సంబంధించి ఇతర ప్రామాణిక భోజనం, జనతా మీల్స్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహారానికి కూడా ఇవే రేట్లు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు ద్వారా ఐఆర్‌సీటీసీ, జోనల్ రైల్వేల్లో అందించే ఆహారం నాణ్యత, శుభ్రత పెరగాలని వెల్లడించింది. దీనిని అంచనా వేసేందుకు తనిఖీలు చేస్తామని పేర్కొంది.
సవరించిన ధరలు జీఎస్‌టీతో కలిపి
వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్: రూ. 35
నాన్ వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్: రూ.45
వెజ్ మీల్స్: రూ.70
స్టాండర్డ్ మీల్స్(కోడిగుడ్డు కూరతో): రూ.80
స్టాండర్డ్ మీల్స్(కోడిమాంసం కూర): రూ.120
వెజ్ బిర్యానీ(350గ్రాములు) : రూ.70
ఎగ్ బిర్యానీ: రూ.80
చికెన్ బిర్యానీ: రూ.100
స్నాక్ మీల్(350 గ్రాములు): రూ.50