Agriculture

ఉద్ధృత ఆందోళనల్లో అమరావతి రైతులు

Amaravati Farmers Protesting For Capital

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా 8వ రోజు చేపట్టిన ఆందోళనలు, నిరసనలతో అమరావతి ప్రాంతం హోరెత్తింది. రైతులు, కూలీలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా దీక్షల్లో కూర్చుని నిరసన తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణరాయపాలెంలో రిలేదీక్షా శిబిరం వద్ద రవికుమార్‌, ఈపూరి ఇస్మాయిల్‌ అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ వెలగపూడిలో జీఎన్‌రావు కమిటీ నివేదిక నమూనా ప్రతులను రైతులు దహనం చేశారు. జీఎన్‌రావు కమిటీ నివేదిక బోగస్‌ అంటూ మండిపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో రైతులు, నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని ఇక్కడే నిర్మించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. తాళ్లాయపాలెం వద్ద కృష్ణానదిలో రాజధాని రైతులు జలదీక్ష చేపట్టారు. పీకల్లోతు నీళ్లలో దిగి నిరసన తెలియజేశారు. కృష్ణా నది పారుతుంటే ఎడారి అంటూ అధికార పార్టీ నేతలు ఎలా వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తామని వెలగపూడి రైతులు ప్రకటించారు. తమ పిల్లలకు ఈ ఏడాది చదువు పోయినా ఫర్వాలేదు కానీ, భవిష్యత్తు నాశనమవుతుంటే ఎలా ఊరుకుంటామని ఆక్షేపించారు. వెలగపూడి గ్రామంలో 8వ రోజు రైతులు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఇంటెలిజెన్స్‌ పోలీసు ఫొటోలు తీయడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. రాజధాని మార్పును నిరసిస్తూ మహిళలు ..రాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో నీరు-మట్టి వద్ద పూజలు చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పూజలు చేసినట్లు మహిళలు తెలిపారు. పవిత్ర నీరు-మట్టి వద్ద అమరావతికి సారె సమర్పించారు. ‘మూడు రాజధానులు వద్దు… అమరావతి ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.