Sports

ఆస్ట్రేలియన్ ఒపెన్ బహుమతి ఇప్పుడు ₹350కోట్లు

Australian Open Hikes Prize Money By 13.6% To 350Crore Rupees

వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు నగదు బహుమతిని నిర్వాహకులు భారీగా పెంచారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి ఏకంగా 13.6 శాతానికి పెంచారు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌మనీ రూ.350 కోట్లకు చేరింది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బహుమతి రూ.20 కోట్లు దక్కనుంది. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించేవారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టేవారికి రూ.63 లక్షలు ఇవ్వనున్నట్లు టోర్నీ డైరెక్టర్‌ క్రేగ్‌ టిలే తెలిపారు. ‘‘ ప్రతి ఏడాదిలా ఈ సారి కూడా నగదు బహుమతిని పెంచాం. 2007తో పోల్చుకుంటే నగదు బహుమతి 2020 సీజన్‌ నాటికి మూడు రెట్లు పెరిగింది. ఈ సీజన్‌లో రౌండ్‌ దాటే కొద్ది ప్రైజ్‌మనీ పెరుగుతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఆటగాళ్లు మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌మనీ గత పదేళ్లలో ఏకంగా 183.9 శాతం పెరిగింది. వచ్చే నెల నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. గత సీజన్‌ పురుషుల సింగిల్స్‌లో నోవాక్‌ జకోవిచ్‌, మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా టైటిల్‌ను గెలిచారు.