బీఎమ్ జ్యువెలరీ అంటే బ్రెస్ట్‌మిల్క్ జ్యువెలరీ. తల్లిపాలతో తయారు చేసే ఆభరణాలివి! ఇలా కూడా ఆభరణాలను తయారుచేస్తారని తెలుసా! రెండేళ్ల క్రితం వరకూ దివ్యకూ అవగాహన లేదు. బెంగళూరులోనే కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన దివ్యకు ఓ పాప ఉంది. ఒక రోజు విదేశాల నుంచి డెలివరీ కోసం వచ్చిన తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. మాటల మధ్యలో ‘బీఎమ్ జ్యువెలరీ’ గురించి దివ్యను అడిగారామె. ‘అసలేంటిది’ అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టారు దివ్య. ‘‘తొలిసారిగా ఈ టెక్నిక్ గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అసలు పాలతో ఆభరణాలు ఎలా చేస్తారనే విషయాన్ని పరిశోధించాను. చివరికి తెలుసుకున్నాను. తొలి ప్రయోగంగా నా బ్రెస్ట్‌మిల్క్‌తోనే ఓ పెండెంట్ రూపొందించాలనుకున్నా’’ అని చెప్పారు దివ్య. ఆ ఒక్క పెండెంట్‌కే ఆమెకు రెండేళ్ల సమయం పట్టింది. అయినా పడ్డ కష్టం వృథా కాలేదు. బాగా తెలిసిన వాళ్లకు తన వర్క్‌ను చూపించారు. తల్లిపాలతో పెండెంట్ అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. తల్లికి బిడ్డతో అనుబంధం ఏర్పడేది అప్పుడే. ఆ మధుర బంధాన్ని జ్ఞాపకంగా మార్చుకోవాలని ఎవరికి ఉండదు. ఇప్పుడు దివ్యకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల మహిళలు క్యూలు కడుతున్నారు. ‘‘ ‘‘దీన్ని బీఎమ్ జ్యువెలరీ అనొచ్చు. కానీ నేను మాత్రం ‘డీఎన్‌ఎ ఆర్టిస్ట్రీ’ అంటాను’’ అన్నారామె. ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వారి నుంచి పాలు సేకరిస్తారు. అయితే వాటిని ఎలా పంపాలో దివ్య వారికి ముందుగానే జాగ్రత్తలు చెబుతారు. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే. వాటిని టెస్ట్‌ట్యూబ్స్‌లో, సిరప్ బాటిల్స్‌లో పెట్టి పంపుతారు. పాలను ముందుగా స్టెరిలైజ్ చేసి వారం రోజులపాటు ఆటోక్లేవ్‌లో భద్రపరుస్తారు. అప్పుడు పాలు ముద్దగా మారిపోతాయి. ఆ తర్వాత వాటి నుంచి కొవ్వును వేరుచేస్తారు. కొన్ని కెమికల్స్ వాడి, వాటికి కావాల్సిన రూపం తీసుకొస్తారు. ‘‘అయితే పాలు ఎలా భద్రపరుస్తున్నామన్నదే ముఖ్యం. లేదంటే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు దివ్య. ‘మిల్కీ వే బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ’ అనే ఫేస్‌బుక్ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తారు. ప్రతి ఆర్డర్‌కు కనీసం ఒక వారం సమయం తీసుకుంటూంటారు. అలా నెలకు కనీసం 10 నుంచి 15 ఆర్డర్లను స్వీకరిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
బ్రెస్ట్ మిల్క్ జ్యూవెలరీ
Related tags :