జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే తనకు ఇష్టమని కథానాయిక శ్రియ పేర్కొన్నారు. ఆమె గత ఏడాది మార్చిలో రష్యకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొశీవ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆమె, కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. పెళ్లి గురించి అత్యంత గోప్యత పాటించారు. దాంతో పెళ్లి వివరాలేవీ బయటికి రాలేదు. అయితే ఇలా రహస్యంగా వివాహం చేసుకోవడం గురించి తాజాగా శ్రియ స్పందించారు. ‘నేను, ఆండ్రీ వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లు అవుతోందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఇందులో దాయడానికి ఏమీ లేదు. కానీ నేను నా జీవితాన్ని ప్రైవేట్‌గా, సింపుల్‌గా ఉంచుకోవడానికే ఇష్టపడతా. నటనే నా ఆహారం, దాన్ని ఇలానే కొనసాగిస్తా. నా భర్త కూడా ఈ విషయంలో చాలా మద్దతుగా ఉంటారు. నేను ఎక్కువగా పనిచేస్తూ బిజీగా ఉంటే.. ఆయన ఆనందిస్తుంటారు. తనకు అదే ఇష్టం’ అని ఆమె చెప్పారు. శ్రియ, ఆండ్రీ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా శ్రియ నటనను కొనసాగిస్తున్నారు. దక్షిణాదితోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. గత ఏడాది ఆమె ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో అతిథిగా కనిపించారు. ప్రస్తుతం ‘తడ్కా’, ‘సండక్కరి’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గోప్యతే నాకిష్టం
Related tags :