Business

ఇండియా….సిద్ధంగా ఉండు-IMF హెచ్చరిక

IMF Warns India Of Recession Right Around The Corner

ఆర్థిక మందగమనం ముంచుకొచ్చిన నేపథ్యంలో, పరిష్కారానికి భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సూచించింది. 2019 ప్రథమార్థంలో పలు అంశాల వల్ల ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ‘ప్రస్తుతం భారత వృద్ధిరేటు నెమ్మదిస్తోంది. ఇది పరిణామపరంగా జరిగేదే (సైక్లిక్‌) కానీ వ్యవస్థాగతం కాదు. పునరుత్తేజం మాత్రం మేం గతంలో అనుకున్నంత వేగంగా జరగదు. ఇదే ప్రధాన సమస్య’ అని వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగ మిషన్‌ చీఫ్‌ రణిల్‌ సల్‌గాడో తెలిపారు. స్థిర వృద్ధి సాధించేలా సంస్కరణలు ఉండాలని ఆకాంక్షించారు. సెప్టెంబరు త్రైమాసిక వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠమైన 4.5 శాతానికి పరిమితం కావడం, ప్రైవేటు గిరాకీ 1 శాతమే కావడం గమనిస్తే, డిసెంబరు త్రైమాసికంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మరింత బలహీనంగా సాగుతున్నాయనే తెలుస్తోందన్నారు. ‘ఆర్థిక సంక్షోభం అనేది పెద్ద విషయం. ఇప్పుడు భారత్‌లో ఏర్పడింది వృద్ధి నెమ్మదించడమే. మేము అంచనా వేసిన దాని కంటే ఎక్కువకాలం ఈ పరిస్థితి కొనసాగుతుందనే భావిస్తున్నాం. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటివి నియంత్రణలోనే ఉన్నాయి’ అని వివరించారు.

ప్రైవేటు వినియోగం తగ్గేందుకు..
* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల నుంచి రుణ వితరణ బాగా తగ్గడం
* అన్ని వ్యవస్థల్లోనూ రుణ జారీ కఠినతరం కావడం
* ఆదాయాల్లో ముఖ్యంగా గ్రామీణ ఆదాయాల్లో వృద్ధి బలహీనంగా ఉండటం వల్ల ప్రైవేటు వినియోగం బాగా తగ్గింది.

ప్రైవేటు పెట్టుబడులు ఇందుకే క్షీణించాయ్‌
* ప్రభుత్వరంగ బ్యాంకులు సహా ఆర్థిక రంగంలోని ఇబ్బందుల వల్ల
* వ్యాపార విశ్వాసం లోపించడం
* వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రభావాలు కూడా ప్రైవేటు పెట్టుబడుల క్షీణతకు కారణమయ్యాయి.

సానుకూలమైన అంశాలివే
* విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠస్థాయిలో ఉన్నాయి
* కరెంటు ఖాతాలోటు కూడా అదుపులో ఉంది
* కూరగాయల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల పెరిగినా, కొన్నేళ్లుగా నియంత్రణలో ఉంది

ఆర్థిక సంస్కరణలే కీలకం
స్వల్పకాలంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడమే అత్యంత కీలకమని రణిల్‌ పేర్కొన్నారు. ‘కార్పొరేట్‌ కంపెనీలపై రుణభారం అధికం కాగా, బ్యాంకులేమో నిరర్థక ఆస్తులతో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు గృహరుణ కంపెనీలకూ ఇక్కట్లు ఆరంభమయ్యాయి. అందువల్ల ఆర్థిక రంగ స్థితిని మెరుగుపరచే సంస్కరణలు అత్యవసరం. దివాలా స్మృతి ప్రక్రియ మరింత సరళంగా జరిగేలా చూడాలి. మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, సంస్కరణలు వేగంగా చేపట్టారు. ఈసారి కూడా సత్వరమే చేపట్టాలి.
* కార్మిక * భూమి * భిన్న ఉత్పత్తులకు విపణిలో పోటీ పెరిగేలా, విద్య, ఆరోగ్య సంరక్షణ, వంటి అంశాల్లో సంస్కరణలు అవసరం.