బ్రిటన్ ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఆయన యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి గెలుపొందారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌కి రిషి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన ఉప ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిషి పనితీరు పట్ల బోరిస్ అత్యంత సంతృప్తిగా ఉన్నట్లు ప్రధాని సన్నిహితులు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అలాగే తాజా ఎన్నికల నేపథ్యంలో టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొన్న రిషి.. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఫిబ్రవరిలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఈ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ వ్యాపార విభాగం వంటి ఉపశాఖల్ని విలీనం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖను మరింత విస్తృతపరిచేందుకు బోరిస్ భావిస్తున్నట్లు లండన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలా కొత్తగా ఏర్పాటయ్యే శాఖకు రిషి నేతృత్వం వహించనున్నారు. నారాయణమూర్తి అల్లుడైన 39 ఏళ్ల రిషి సునక్.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్ కౌంటీలోజన్మించారు. తాజా ఎన్నికల్లో యార్క్ షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దిగువ సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ అల్లుడు
Related tags :