Kids

సొమ్ముల కన్నా న్యాయమే గొప్పది-తెలుగు చిన్నారుల కథలు

Justice Is The Most Worthy Item-Telugu Kids Moral Stories-Akbar Birbal

ఒకరోజు సభామందిరంలో ఆసీనుడై ఉన్న అక్బర్‌ బీర్బల్‌ను ఉద్దేశించి… ‘నేను నీకు ఒక బంగారు నాణేన్ని, న్యాయాన్ని ఇచ్చి, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకొమ్మంటే ఏది ఎంచుకుంటావు?’ అని అడిగాడు.
‘‘జహాపనా! నేను బంగారు నాణేన్ని ఎంచుకుంటాను’’ అని ఏమాత్రం తటపటాయించకుండా సమాధానం చెప్పాడు బీర్బల్‌.
ఆ సమాధానం విన్న అక్బర్‌ ఆశ్చర్యపోయాడు. సభామందిరం మొత్తం నిశ్శబ్దంగా మారింది. బీర్బల్‌ అలా అనడం సభికులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
‘‘నేను ఆ సమాధానం వస్తుందని ఊహించలేదు బీర్బల్‌. బంగారు నాణెం కన్నా న్యాయం చాలా గొప్పది కదా!’’ అన్నాడు అక్బర్‌ కొంత అసహనంగా!
‘‘నన్ను మన్నించండి ప్రభూ! నా దగ్గర లేని దాన్నే కదా నేను తీసుకోవాలి. మీ పాలనలో న్యాయం అంతటా పరిఢవిల్లుతోంది. నా దగ్గర డబ్బు మాత్రమే లేదు. అందుకే నేను బంగారు నాణేన్ని తీసుకున్నాను’’ అన్నాడు బీర్బల్‌.
బీర్బల్‌ సమాధానం విన్న అక్బర్‌ హాయిగా నవ్వుకున్నాడు. మరో 100 బంగారు నాణేలు బీర్బల్‌కు బహుమతిగా అందించాడు.