WorldWonders

మసీదును పొదుముకున్న హిందువులు

Bihar Hindus Taking Care Of Local Masjid

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాక్టికల్‌ ఎగ్జాంపుల్‌ బిహార్, నలంద జిల్లాలోని మారి గ్రామం. అక్కడ 200 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఉపాధి కోసం ఆ గ్రామంలోని ముస్లిములంతా ఏనాడో వలసవెళ్లిపోయారు. మిగిలింది హిందువులే. ఒక్క ముస్లిం కూడా ఆ గ్రామంలో లేకుండా పోయినప్పటి నుంచి ఆ మసీదు సంరక్షణ బాధ్యతను గ్రామంలోని హిందువులే తీసుకున్నారు. ఆ ప్రార్థన మందిరాన్ని రోజూ శుభ్రంగా ఉడ్వడం… తడిగుడ్డతో తుడవడం దగ్గర్నుంచి పెచ్చులూడిపోతున్న గోడలకు మరమ్మతులు చేయడం.. పెయింటింగ్‌ వేయడం వంటి అన్ని పనులూ హిందువులే నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. అజా వేళ్లల్లో అజానూ వినిపిస్తున్నారు. ‘‘పెన్‌డ్రైవ్‌లో అజాను రికార్డ్‌ చేయించి టైమ్‌కి ఆ రికార్డ్‌ను వేస్తున్నాం. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఈ ఊళ్లో అందరికీ ఈ మసీదు పవిత్ర స్థలమే. ఈ ఊళ్లో  ఏ హిందువుల ఇంట్లో పెళ్లయినా ఆ కొత్త జంట ముందుగా ఈ మసీదుకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఊరి సంప్రదాయం అది. ఈ చుట్టుపక్కల ఊళ్లల్లో హిందూముస్లింల మధ్య చాలానే గొడవలయ్యాయి. కానీ మా ఊళ్లో ఎలాంటి గొడవలూ జరగలేదు. మేమంతా కలిసిమెలిసే ఉంటూ వస్తున్నాం. ఉంటాం కూడా’’ అని చెప్తాడు ఆ మసీదును చూసుకుంటున్న మారి గ్రామ నివాసి ఒకరు.