కొడనాడు ఎస్టేట్‌కు తానే యజమానిగా ఆదాయపు పన్ను శాఖకు జయలలిత నెచ్చెలి శశికళ తరఫున సమర్పించిన సమాధానంలో వెల్లడించారు. శశికళ కుటుంబ సభ్యుల నివాసాలు, సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గతంలో ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించగా, దానికి సంబంధించిన పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రద్దయిన పెద్దనోట్లతో రూ.1,900 కోట్ల మేరకు ఆస్తులు కొనుగోలు చేసినట్టు, ఫైనాన్స్ చేసినట్టు తెలిసింది. దీనిపై అక్టోబరు 22వ తేదీలోపు సమాధానం ఇవ్వాలంటూ జైలులోని శశికళకు ఐటీ అధికారులు నోటీసు పంపారు. ఆ నోటీసు అక్టోబరు 19న అందిందని, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వడం కష్టం కావడంతో నెల గడువు ఇవ్వాలంటూ శశికళ తరఫున ఆడిటర్ లేఖ పంపారు. 15 రోజుల గడువు ఇవ్వగా ఆలోపు సమాధానం ఇవ్వలేదని, ఎట్టకేలకు ఈ నెల 11న నివేదిక సమర్పించారని తెలిసింది. రూ.1900 కోట్ల రద్దయిన పెద్ద నోట్లతో కొనుగోలు చేసిన ఆస్తులతో తమకు సంబంధం లేదని చెప్పడంతోపాటు శశికళకు ఉన్న ఆస్తుల వివరాలనూ అందులో వెల్లడించినట్టు తెలిసింది. ఆ మేరకు ‘నమదు ఎంజీఆర్’, ‘జయ ప్రింటర్స్’ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. జయలలితకు చెందినట్టు చెబుతున్న జయ ఫామ్ హౌస్, జె.ఎస్.హౌసింగ్ డెవెలప్‌మెంట్, జై రియల్ ఎస్టేట్, గ్రీన్ ఫామ్ హౌస్‌ల్లో షేర్లు ఉన్నాయని వెల్లడించారు. కొడనాడు ఎస్టేట్, మరో నాలుగు ఆస్తుల్లో 2016 ఏప్రిల్ 1 నుంచి జయలలిత మరణం వరకు భాగస్వామిగా ఉన్నట్టు, జయలలిత మరణానంతరం యజమానిగా ఉన్నట్టు వెల్లడించినట్టు తెలిసింది. వీటితోపాటు ఇండో దోహా కెమికల్స్, ఫార్మసూటికల్ లిమిటెడ్, ఆంజనేయ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో శశికళ డైరెక్టర్‌గా ఉన్నారని, జాస్ సినిమాస్ సంస్థలో 41.66 లక్షల షేర్లు, ఆరే ల్యాండ్ డెవెలపర్స్ సంస్థలో 3.6 లక్షల షేర్లు, మేవిస్ ఛాట్‌కమ్ సంస్థలో 7.02 లక్షలు, రామ్‌రాజ్ ఆగ్రో మిల్స్ సంస్థలో 36 వేల షేర్లు ఉన్నాయని తెలిపినట్టు సమాచారం.
ఆ ఎస్టేట్ నాది
Related tags :