Politics

33వేల ఎకరాల భవిత త్వరలోనే తేలుస్తాం

Botsa Speaks On 33000 Acres Of Amaravati Capital

అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే ఆలోచన తమకు లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి బొత్స సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ…. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ తెదేపా ప్రభుత్వం చేసినట్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేయబోం. గ్రాఫిక్స్‌, సినిమాలు మేం చూపించం.. అన్నీ వాస్తవాలే చెబుతాం. అమరావతిలో 50శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తాం. రేపు మంత్రి మండలి సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదు. రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాలను ఏం చేస్తామో త్వరలో చెబుతాం. ఐదేళ్లు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబులా రైతులను మోసం చేయబోం. ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. అమరావతిలో 29 గ్రామాలను అభివృద్ధి చేయాలని కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్ర ఆదాయం..ఖర్చు ఎంతనేదానిపై చర్చిస్తాం. 3 ప్రాంతాల్లో రాజధానికి ఎంత ఖర్చవుతుందో రేపు చెబుతాం. వేల కోట్ల అప్పులను చంద్రబాబు లక్షల కోట్లకు తీసుకెళ్లారు. అమరావతిలో రూ.5,458 కోట్లు మాత్రమే తెదేపా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం కన్సల్టెంట్లకు రూ.340 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ఆదాయం మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆదాయం, కేంద్రంతో సంబంధాల ఆధారంగా ముందుకెళ్తున్నాం. విద్య, వైద్యం, ప్రాజెక్టులకు నిధులు ఎక్కణ్ణుంచి తెస్తాం?. రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదు. ఐదేళ్లలో రాజధానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1500 కోట్లు . తెదేపా నేతలు ప్రాంతాల వారీగా వేర్వేరుగా మాట్లాడుతున్నారు. భాజపా నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.. వాటిపై స్పందించం’’ అని బొత్స అన్నారు.