తెరాసకు ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతూ కేసీఆర్ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చేలా తీర్పులిస్తూ వచ్చారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గుర్తు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా జనం తెరాస వెంటే నిలిచారన్నారు. 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తెరాస.. 2018లో జరిగిన ఎన్నికల్లో 88 స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గడిచిన ఐదేళ్లలో మేం ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ప్రజలు కోరుకొనేవిధంగా కనీస మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన, వారికి సేవలందించే అంశంపైనే ప్రభుత్వ పరంగా కేంద్రీకరించి పనిచేశాం. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం తీసుకొచ్చాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాక 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిచ్చింది. దీన్నో యజ్ఞంలా నిర్వహించాం. పట్టణాల్లోనూ విద్యుత్, తాగునీరు అందించే విషయంలో ప్రజలకు చెప్పిందే చేసి చూపించాం’’ అన్నారు.
* మా అజెండా అదే..
‘‘తెలంగాణలోని మొత్తం 141 మున్సిపాల్టీలకు గాను సింహభాగంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే అజెండాతోనే మేం ముందుకెళ్తున్నాం. ఆ అజెండాను బలపరిచే విధంగా మా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. మా పార్టీ 60 లక్షల మంది సభ్యులతో ఓ బలమైన శక్తిగా అవతరించింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాల విషయంలో చాలా పురోగతి సాధించాం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాల్టీలకు నిధులు కేటాయించాం. తరతమ బేధాలు లేకుండా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాం. ప్రజలకు కావాల్సిన వసతులు అందించాలనే దృఢ సంకల్పంతోనే మేం ముందుకెళ్తున్నాం’’ అని చెప్పారు.
* మేం చేపట్టిన పథకాలే మాకు శ్రీరామరక్ష
‘‘కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే మా అజెండాగా ముందుకెళ్తాం. కేసీఆర్ కిట్, ఆసరా పింఛను, రైతుబంధు, రైతు బీమా.. ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు కేసీఆర్ కార్యదక్షత, నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ప్రభుత్వ పనితీరే మాకు బలం. అదే పెద్ద అస్త్రం. అంతేకాకుండా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా 60లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారు. చేసిన పనిని ప్రజలకు చెబుదామని ఈ సమావేశంలో పార్టీ నేతలకు సూచించాం. విజయం సిద్ధించాలంటే ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కోరాం’’ అని తెలిపారు.
* అతి త్వరలోనే నేతలతో కేసీఆర్ సమావేశం
అతి త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంయుక్తంగా సమావేశం నిర్వహించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన వివరంగా మాట్లాడతారు. పురపాలక ఎన్నికల్లో తెరాస విజయంపై మా వరకు మేం ఎంతో విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటిదాకా తెరాసకు మంచి ఫలితాలు వచ్చాయి గనక ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి విజయం సాధిస్తామనే ధీమాతో ముందుకెళ్తున్నాం’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.