Sports

రాహుల్-సౌరవ్ భేటీ

Sourav Ganguly Rahul Dravid Meets

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అధ్యక్షుడు రాహుల్‌ ద్రవిడ్‌ గురువారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఎన్‌సీఏపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇటీవల భారత పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రాకు ఫిట్‌నెస్‌ నిర్వహించేందుకు ఎన్‌సీఏ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌, దాదా భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, గంగూలీ మాత్రం ఇది సాధారణ సమావేశమేనని తెలిపాడు. క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ), కొత్త సెలక్టర్ల నియమాకంపై కూడా చర్చ సాగినట్లు తెలుస్తోంది.ఇటీవల గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా, హార్దిక్‌ పాండ్య కోలుకోవడానికి ఎన్‌సీఏకు వెళ్లలేదు. వ్యక్తిగత ట్రైనర్‌ సాయంతో కోలుకునే ప్రయత్నం చేశారు. తిరిగి కోలుకున్న బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం ఎన్‌సీఏకు వెళ్లగా అతడికి పరీక్ష నిర్వహించడానికి నిరాకరించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై గతంలో దాదా స్పందిస్తూ.. ‘‘ భారత్‌ క్రికెట్‌కు సంబంధించి ప్రతి అంతర్జాతీయ ఆటగాడి కెరీర్లోనూ ఎన్‌సీఏ భూమిక కీలకం. ఎన్‌సీఏ ద్వారానే అన్ని ప్రక్రియలూ జరగాలి. ఆటగాళ్లకు సమస్య వచ్చినపుడు అక్కడికే వెళ్లాలి. నేను బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది. ఈ విషయమై ద్రవిడ్‌తో మాట్లాడతా. సమస్య ఏంటో అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’’ అని గంగూలీ అన్నాడు. దీంతో దాదా-ద్రవిడ్‌ భేటీలో ఎన్‌సీఏ విధివిధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.