WorldWonders

బెనారస్ యూనివర్శిటీలో భూతవైద్య తరగతులు

BHU Offers Paranormal Science Courses

మీరు చదివింది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ‘భూతవైద్యం’ (పారానార్మల్ సైన్స్) పై ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. తొలి బ్యాచ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి కోర్సును ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి.

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్) డిగ్రీలు కలిగిన విద్యార్థులు ‘సైకోసోమాటిక్ డిజార్డర్స్’ (మానసిక రుగ్మతలు) అధ్యయనం కోసం ఈ కోర్సులో చేరవచ్చని యూనివర్సిటీ పేర్కొంది. ‘భూతవైద్యం’ అష్టాంగ ఆయుర్వేదంలో ఓ భాగమని బీహెచ్‌యూ ఆయుర్వేద ఫాకల్టీ డీన్ యామిని భూషణ్ త్రిపాఠీ పేర్కొన్నారు.

ఏడాదికి పదిమందికి చొప్పున ఈ కోర్సులో శిక్షణ ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. కోర్సు ఫీజు రూ.50 వేల రూపాయలు. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. కాగా, బీహెచ్‌యూ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆధునిక యుగంలో ఇలాంటి భూత,ప్రేత, పిశాచాలు ఉన్నాయన్నది కొందరి విశ్వాసం. గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ ఇలాంటి అంధవిశ్వాలు కొందరిలో ఉన్నాయి. ఇటువంటి వాటిని సొమ్ము చేసుకునే మాంత్రికులు కూడా ఉన్నారు. ఇటువంటి విశ్వాసాల నుంచి ప్రజలను దూరంగా ఉంచాల్సిన యూనివర్సిటీ.. తనే ఏకంగా ఇలాంటి కోర్సును ఆఫర్ చేస్తుండడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.