* ఇప్పటిదాకా ఐర్లాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ సీఆర్‌హెచ్ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్ ఇండస్ట్రీస్’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్, జూపల్లి రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గ్రూప్ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది. 4 ప్లాంట్స్, 10 లక్షల టన్ను..: మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ‘మహా సిమెంట్’ బ్రాండ్ పేరిట గ్రే సిమెంట్ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంట్ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్ గ్రూప్… సిమెం ట్, కన్‌స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది.
* విస్తార ఎయిర్‌లైన్స్ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు.
* అల్లర్లు, ఆందోళనల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తుంటారు. వదంతులు వ్యాపించకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే దీని వల్ల టెలికాం సంస్థలు ఆదాయ పరంగా కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయి. ఆందోళనల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో మొబైల్ ఆపరేటర్లు ప్రతి గంటకు దాదాపు రూ. 2.45కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థను, ఇంటర్నెట్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ సహా యూపీ, అసోం లాంటి రాష్ట్రాల్లో మొబైల్ సేవలపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఇప్పటికీ యూపీలోని చాలా జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ కొనసాగుతోంది. దిల్లీలోని కొన్ని గంటల పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా నిలిపివేశారు.
* పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలన్స్ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్‌బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్‌టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్‌బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది.
* నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్ ఓవర్సీస్, అలహాబాద్ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్‌బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్ బ్యాంకు గురువారమే ప్రకటించింది.
* బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు శుక్రవారం దుమ్ము రేపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటంతో సెన్సెక్స్ కీలకమైన 41,500 పాయింట్లపైకి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. జనవరి సిరీస్ డెరివేటివ్స్ పటిష్టమైన లాభాలతో ఆరంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 411 పాయింట్ల లాభంతో 41,575 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 119 పాయింట్ల ఎగసి 12,246 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి 71.36ను తాకినప్పటికీ, (ఇంట్రాడేలో) మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. అయితే వారం మొత్తంగా చూస్తే మాత్రం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. బుధవారం క్రిస్మస్ సెలవు కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగింది. ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 107 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.