అది ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయం.. స్కిన్ టైట్ ప్యాంటు.. యువత వాడే డిజైనర్ చొక్కాతో ఓ కుర్రాడు వచ్చారక్కడకి.. ఆ సమయంలో స్టేషన్ సిబ్బంది తప్ప అధికారులు ఎవరూ లేరు. అతను సరాసరి రైటర్ రూమ్‌లోకి వెళ్లారు. ఎవరు మీరు.. ఏం కావాలని ప్రశ్నించారు అక్కడి సిబ్బంది.. నా సెల్‌ఫోన్ పోయిందనీ, ఫిర్యాదు తీసుకోవాలని చెప్పారతను.. ఏం ఫోను, ఐఎంఈఐ నంబరు ఉందా.. తదితర వివరాలు అడిగారక్కడి సిబ్బంది. ఫిర్యాదు రాయమని చెప్పారు. స్టేషన్లో కూర్చుని ఆయన ఫిర్యాదు రాశారు. అక్కడే ఉన్న సిబ్బందికి ఫిర్యాదు కాగితాన్ని అందించారు. తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని అడిగారు. దానికి స్టేషన్ సిబ్బందిని అతన్ని తేరిపార చూశారు. ఫిర్యాదు తీసుకుని అతడిని తమదైన శైలిలో విచారించారు. యక్ష ప్రశ్నలు వేశారు. ఫోన్ ఎలా పోయిందని ప్రశ్నించారు. తాను ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి లాక్కుపోయాడని సమాధానం ఇచ్చారా యువకుడు. దానికి పోలీసులు అసలు మీదేవూరు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు. తనది బెంగళూరు అని, మిత్రులతో కలిసి ఒంగోలుకు వచ్చినట్లు చెప్పారాయన. వాళ్లు అతన్ని నమ్మలేదు. ‘నగరంలో సీసీ కెమెరాలున్నాయ్, అవి పరిశీలిస్తాం.. నీది తప్పని తేలితే ఏం చేయమంటావ్’ అని హూంకరించాడో హెడ్డు గారు.. ఫిర్యాది మౌనంగా ఉండిపోయారు. అంతలో స్టేషన్లోకి ఓ ఎస్సై వచ్చారు. స్టేషన్ సిబ్బంది ఆ ఫిర్యాదిని ఎస్సైను కలవాలని సూచించారు. ఎస్సై ఫిర్యాదితో మాట్లాడి… సీఐ స్టేషన్‌కు వచ్చిన తర్వాత మాట్లాడుదామని చెప్పారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. బాధితుడిని మరోసారి తనదైన శైలిలో విచారించారు. అప్పటికే స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పిన ఫిర్యాది మరోసారి ఆ కానిస్టేబుల్‌కూ విషయం పూసగుచ్చినట్లు చెప్పారు. అంతా విన్న తర్వాత ‘రోజూ నగరంలో వంద ఫోన్లు పోతుంటాయి… అన్నీ కేసులు కడితే స్టేషన్ మూసుకోవాల్సిందే’నని పరుషంగా మాట్లాడాడు ఆ కానిస్టేబుల్… ఇలా సుమారు 45 నిమిషాలు… బాధితుడు నిలుగాళ్లపైనే… వారు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఓపిగ్గా సమాధానం చెప్పారు. అంతసేపు స్టేషన్లో ఉన్నా.. సిబ్బంది అతడిని కూర్చోమని కూడా చెప్పలేదు. సరిగా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ల పనిలో వాళ్లుంటే.. అక్కడే అలాగే నిల్చొని ఉండిపోయాడతడు… చూసీ చూసీ ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చాడతను. అంతలో ఏదో పోలీసు వాహనం వచ్చింది. బాధితుడు అందులో ఎక్కిన వెంటనే వాహనం ముందుకు కదిలింది… అప్పటికి గానీ… అతనెవరో వారికి అర్థం కాలేదు. ఒక్కసారిగా వారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. ఎందుకంటే… ఆ బాధిత ఫిర్యాది ఎవరో కాదు.. జిల్లాకు క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం కొత్తగా వచ్చిన ఐపీఎస్ పి.జగదీష్.
*** రిసెప్షన్ లేదు.. రసీదూ ఇవ్వలేదు..
‘ఏదో ఒక సమస్య మీద స్టేషన్‌కు వచ్చిన బాధితుడ్ని నవ్వుతూ పలకరించాలి.. అతని బాధను తెలుసుకోవాలి.. మీరు అతని సమస్యను సావధానంగా వింటే అతనికి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మీరు ఆ సమస్య పరిష్కరించినా, పరిష్కరించకపోయినా అతను చెప్పేది వింటే బాధితుడికి సగం ధైర్యం వస్తుంద’ని ఉన్నతాధికారులు పదేపదే శిక్షణ కార్యక్రమాల్లో వల్లె వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధితుడి రూపంలో సుమారు 45 నిమిషాలపాటు అక్కడున్నా స్టేషన్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. పైగా వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పరుష పదజాలాన్ని వినియోగించారు. స్టేషన్లో తనకు ఎదురైన పరిస్థితిని ఆయన నివేదిక రూపంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు అందజేశారు. ఆ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ లేదని, రిసెప్షనిస్టూ లేరని, బాధితులపట్ల స్టేషన్ సిబ్బంది వ్యవహారశైలి అత్యంత దారుణంగా ఉందని దానిలో పేర్కొన్నారు.
*** రైటర్‌పై చర్యలు, అధికారులకు తాఖీదులు
ఈ మొత్తం వ్యవహారంలో స్టేషన్ బాధ్యుడైన రైటర్ కె.సుధాకర్‌ను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. ఎస్‌హెచ్‌వోగా వ్యవహరిస్తున్న ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్, ఎస్సై వి.సాంబశివయ్యలకు తాఖీదులు జారీ చేశారు. బాధితుడు వచ్చిన సమయంలో స్టేషన్లోనే ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ పి.ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎం.వి.రాజేష్, మహిళా కానిస్టేబుల్ ఎం.రమ్య కిరణ్మయిలపై తక్షణ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బాధితుడు వేదనతో స్టేషన్‌కు వచ్చినప్పుడు… వారిని మర్యాదగా పలకరించడం, కరుణ చూపడం మాని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ కౌశల్ తెలిపారు. స్టేషన్ రైటర్ వ్యవహారశైలి దారుణంగా ఉందని పేర్కొన్నారు.