Movies

బాధ గర్వం మిళితం

Sharatkumar Speaks Of His Daughter Varalaxmi

తన కుమార్తె వరలక్ష్మికి ఓ విషయంలో సాయం చేయలేకపోయానని నటుడు శరత్‌ కుమార్‌ తెలిపారు. ఆ విషయం తననెంతో బాధపెట్టిందని ఆయన పేర్కొన్నారు. శింబు కథానాయకుడిగా నటించిన ‘పోడా పోడి’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఆ తర్వాత ఆమె పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వరలక్ష్మి తండ్రి నటుడు శరత్‌కుమార్‌ ఓ ఆంగ్ల పత్రికతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా నటిగా వరలక్ష్మిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపారు. ‘తను నటించిన ‘పోడా పోడి’ సినిమా విడుదల కోసం నా కూతురు వరలక్ష్మి కొంతకాలంపాటు ఎదురుచూసింది. ఒక తండ్రిగా తన సినిమా విడుదలకు నేను సాయం చేయవచ్చు. కానీ ఆ సమయంలో నేను చేయలేదు. ఆ విషయంలో కూతుర్ని నిరాశపరిచిన తండ్రిగా నన్ను నేను అనుకుంటాను. కానీ ఈ రోజు తనని చూస్తుంటే నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉంది. నా కుమార్తెకు కంగ్రాట్స్‌’ అని శరత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం శరత్‌కుమార్‌-వరలక్ష్మి కలిసి కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఓ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఈ సినిమాలో రాధిక కూడా ఓ కీలకపాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు శరత్‌కుమార్‌.. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో కీలకపాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.