Agriculture

తెలంగాణా నిమ్మరైతుల విజయగాథ

Telangana Lemon Farmers Yileding Success

నారాయణపేట జిల్లా రైతులు వినూత్నంగా ఆలోచించి నిమ్మతోటల్ని సాగు చేసి లాభాల బాట పట్టారు. ఆ రైతుల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వరి, పత్తి, కంది లాంటి పంటల సాగుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సాగునీరు అంతగాలేని నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మండలం మాదన్‌పల్లి గ్రామానికి చెందిన నలుగురు రైతులు వినూత్న ఆలోచన చేసి నిమ్మతోటను సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు పరిమితం కాకుండా ప్రతిరోజూ ఆదాయం ఇచ్చే నిమ్మతోటలు సాగుచేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాదన్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు శ్రీనివాసులు, వీరన్న, వెంకటమ్మ, పరశురాములు వారి కున్న 11 ఎకరాల్లో తొలుత వరి, పత్తి, కంది పంటలు పండించి నష్టాలు చవిచూశారు.

ఈసారి వినూత్నంగా ఆలోచించి మొత్తం 11 ఎకరాల్లో నిమ్మతోటకు ఐదేళ్ల క్రితం పునాదులు వేశారు. ఒక ఎకరంలో 120 నిమ్మ మొక్కలను చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు నుంచి తెప్పించి నాటారు. 3 నుంచి ఐదేళ్ల పరిమితిలో తొలి కాపు కాసే వరకు ఖర్చులు భరించగా ఆ తర్వాత ప్రతి రోజూ దిగుబడులు చవి చూస్తున్నారు. 25 కేజీల నిమ్మకాయల బస్తా సీజన్‌లో రూ. 2వేల వరకు ధర పలుకగా అన్‌సీజన్‌లో 500 నుంచి రూ. 600 వరకు ధర పలుకుతోందని, ప్రతి రోజు ఆదాయంతో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిమ్మకాయలను హైదరాబాద్‌, రాయచూరు, కర్నూల్‌కు తరలించి మార్కెట్‌లలో అమ్ము తున్నట్లు తెలిపారు. సాగు నీటి కొరతతో నిమ్మకాయల నాణ్యత కాస్త తక్కువగా ఉన్నదని సాగునీరు ఉంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకాయలకు శుభకార్యాలతో పాటు హోటళ్లలో డిమాండ్‌ ఉండటంతో ఆదాయం బాగా వస్తోందని తెలిపారు. ఒక మొక్క కాలపరిమితి 35 సంవత్సరాలు. తొలి ఐదేళ్లు మినహా మిగతా కాల మంతా ప్రతి రోజు ఆదాయం వచ్చే అవకాశం ఉండ టంతో ఎక్కువ మంది రైతులు నిమ్మ సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

రోజూ ఆదాయం : ఈరన్న, రైతు
నాకున్న మూడెకరాల్లో నిమ్మతోటను సాగు చేశాను. మొక్క నాటిన రోజు నుంచి కాపు వచ్చే వరకు అయిన ఖర్చు తొలి దిగుబడిలోనే రాబట్టడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి రోజు నిమ్మతోట నుంచి ఆదాయం వస్తుండటంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటున్నాం.

సబ్సిడీ ఇవ్వాలి : శ్రీనివాసులు, రైతు
వరి, పత్తి సాగుచేసి నష్టాలు చవిచూశాను. కొందరి సలహా మేరకు రైల్వేకోడూరు నుంచి మొక్కలు తెప్పించి శాస్త్రవేత్తల సూచనల మేరకు నిమ్మతోట సాగుచేస్తున్నాను. పెద్దగా ఖర్చు లేకపోవడంతో ఆదాయం బాగానే వస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది.