* మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. కైలాసగిరిలో, వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్క్‌లో జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
* కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భాజపాపై శనివారం తీవ్ర విమర్శలు చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో భాజపా అనుసరిస్తున్న విధానాల వల్ల అసోం ప్రజలు మళ్లీ హింసాత్మక ఘటనల మార్గంలోకి వస్తున్నారని ఆరోపించారు. గువహటిలో నిర్వహించిన రాజ్యాంగ రక్షణ, దేశరక్షణ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భాజపాకు ప్రజల సమస్యలను పట్టించుకోవడంపై శ్రద్ధ లేదు.. కానీ నిరసనలు చేస్తున్న వారిపై కాల్పులు ఎందుకు జరుపుతున్నారని రాహుల్ మండిపడ్డారు.
* ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణకు ప్రకటించిన ప్యాకేజీ అమలు వేగవంతం, పర్యవేక్షణే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం కొలువుదీరింది. మొత్తం ఏడుగురితో ఈ బృందం ఏర్పడినట్లు సమాచారం. ఈ ఉప సంఘంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి, పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభ్యులుగా ఉన్నారని సమాచారం.
* రిజర్వేషన్లు ప్రకటించకుండా పురపాలక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించాయి. పురపోరు నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి… ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై చర్చించారు. అయితే, తమ అభిప్రాయాలు పట్టించుకోవడం లేదంటూ ఈసీ అధికారుల తీరు సరిగా లేదని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది.
* దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రజలపైకి నెట్టివేస్తు్న్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలన్నీ శాంతియుతంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్‌ఆర్‌సీని అమలు చేయమని ప్రకటించారని.. ఎన్పీఆర్‌ను కూడా వ్యతిరేకించాలని ఏచూరి విజ్ఞప్తి చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమన్న అమరావతి రైతులు 11వ రోజూ తమ నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. ఓ వైపు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే మరోవైపు తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో రాజధాని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘రచయితలారా.. రాజధాని రైతులకు మద్దతివ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశారు.
* భారత రైల్వే చరిత్రలో ‘ప్రైవేటు’ రైలుగా పేరొందిన తేజస్ రైలు మరో మార్గంలోకి అందుబాటులోకి రానుంది. త్వరలోనే రెండో తేజస్ రైలు పట్టాలెక్కనుంది. జనవరి 17న అహ్మదాబాద్-ముంబయి మధ్య ఈ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జనవరి 19 నుంచి రైలు కమర్షియల్ రన్ మొదలవనుంది. గురువారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు ఈ రైలు నడవనుంది.
* భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 1700 మందికిపైగా పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. నిరంతరాయంగా కురుస్తున్న మంచు.. సిక్కింలోని జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డుపై పేరుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. దీనితో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాల్లో చిక్కుకుపోయిన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. కాగా వారిని రక్షించటానికి భారత సైన్యం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది.
* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. తాజాగా ఆయనపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ నాయకులు ఏం చేయాలో సైన్యాధిపతి చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన పని ఆయన చూసుకుంటే చాలని దుయ్యబట్టారు.
* టీమిండియా సెలెక్షన్ కమిటీలోని వారంతా ఒకేసారి మారిపోరని, ముగ్గురు సభ్యులు ఇంకో ఏడాదిపాటు కొనసాగుతారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశారు. ప్రస్తుత ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం ముగియడంతో అతడి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అతడితో పాటు గగన్ ఖోడా సైతం తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పుకొచ్చారు.
* మోదీ ప్రభుత్వం కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన(మోదీ) 15 మంది మిత్రులు ఎలాంటి ధ్రువపత్రాలు చూపాల్సిన అవసరం లేదు. అయినా ఆదాయమంతా నేరుగా వారి జేబుల్లోకే వెళుతుంది’’ అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా చేపట్టిన ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ నోట్లరద్దు కంటే కూడా ఎక్కువ వినాశనకరమైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
* విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేయాలనే తలంపు తెదేపాలో కనిపిస్తోందని మండిపడ్డారు. ‘ ఆ పార్టీ నేతలంతా అమరావతి చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు. ఆ భూముల ద్వారా వచ్చే లాభాన్ని విదేశాలకు తరలించాలన్న తలంపు వారిది. విశాఖ పరిపాలనకు అనుకూలంగా ఉందనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’ అని విజయసాయి తెలిపారు.
* గత ఏడు నెలలుగా సీఎం జగన్ తవ్వుతున్నది అవినీతిని కాదనీ.. వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి గొయ్యి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై న్యాయ విచారణకు తాము సిద్ధమని ప్రకటించిన లోకేశ్.. గత ఏడు నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు సీఎం జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
* నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వ్యవహారశైలిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్‌నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. ‘‘గాంధీ భవన్ చుట్టూ పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముంది?నగర సీపీ వైఖరి సరిగా లేదు. ఓవరాక్షన్ చేస్తే అంతు చూస్తాం… వదిలిపెట్టే ప్రసక్తేలేదు.’’ అని వ్యాఖ్యానించారు.
* సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. అత్యంత రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 73 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
* ఎంపిక చేసిన నగదు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జనవరి 1 నుంచి ఈ ఛార్జీలను రద్దు చేస్తామని తెలిపారు. త్వరలో ఎంపిక చేసిన నగదు లావాదేవీలను త్వరలో నోటిఫై చేస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* అల్లర్లు, ఆందోళనల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తుంటారు. వదంతులు వ్యాపించకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే దీని వల్ల టెలికాం సంస్థలు ఆదాయ పరంగా కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయి. ఆందోళనల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో మొబైల్ ఆపరేటర్లు ప్రతి గంటకు దాదాపు రూ. 2.45కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
* మూడు రాజధానుల ప్రతిపాదనలపై రాజదాని ప్రాంతంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. వరుసగా 11వ రోజూ రైతులు, మహిళలు రోడ్లెక్కారు. ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తూ.. ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
* ఆటగాళ్లకు సమస్య వచ్చినప్పుడు పునరావాసం కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్‌సీఏ) వెళ్లాల్సి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘‘రాహుల్ ద్రవిడ్‌ను నేను కలిశాను. మేము ఒక పద్ధతి రూపొందించాం. బౌలర్లు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాలి. వారు చికిత్స పొందాలంటే తప్పకుండా ఎన్‌సీఏకి వెళ్లాల్సిందే. కొత్త ప్రదేశంలో ఎన్‌సీఏ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది. మేం మరో 18 నెలలు ఉంటే.. అత్యాధునిక వసతులు, టెక్నాలజీ ఉన్న సరికొత్త ఎన్‌సీఏని చూస్తారు’’ అని దాదా తెలిపాడు.
* ‘ఎట్టకేలకు మేరీతో తలపడే అవకాశం దక్కింది. ఇది మరపురాని పోరుగా నిలిచేలా చూస్తా. నిజాయితీగా ఆడతా’ అన్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలు అడియాసలే అయ్యాయి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ (51 కిలోలు) చేతిలో ఆమె ఘోర పరాజయం చవిచూసింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో 9-1 తేడాతో ఓటమి పాలైంది. ఈ పోరులో అనుభవశాలైన మేరీకోమ్ ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించింది. ఆమె ధాటికి జరీన్ తట్టుకోలేక పోయింది.