Devotional

పుష్య మాసం విశిష్టత

What is pushya masam and its importance?

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం.

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్ర్తియ కోణం ఏంటంటే ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మ దర్శి

న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.

పుష్యమాసం తొలి అర్ధ్భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది.

ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జురుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.

ఆరోజు నుండీ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని, సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి.

సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. తెలకపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.