* నిపుణుల కమిటీ నివేదికపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు చేయూతనిస్తే హైదరాబాద్‌ను తలదన్నే ప్రాంతంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా ఎంపీ సుజనాచౌదరి బ్లాక్ మెయిలింగ్‌కు భయపడేవాళ్లు ఎవరూ లేరని బొత్స ఎద్దేవా చేశారు.
* ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. అప్పుడు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.
* దేవాలయాలకు వచ్చిన డబ్బును హజ్‌యాత్రలకు ఎలా ఇస్తారని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గ్లోబల్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తితిదేకి గత ఐదేళ్లలో వచ్చిన కానుకలు, డబ్బుపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని.. కాగ్‌కి తితిదే ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
* ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ వినియోగదారులకు మరో షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.23గా ఉన్న మొత్తాన్ని రూ.45 చేసింది. అంటే అవాంతరాలు లేని ఎయిర్టెల్ సేవలు పొందాలంటే వినియోగదారులు నెలకు మరో రూ.22 అదనంగా చెల్లించాలన్నమాట! పెంచిన కనీస రీఛార్జి మొత్తాన్ని నేటి నుంచే అమలు చేస్తున్నామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
* జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) చేపట్టాలనుకుంటే ప్రభుత్వం అందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఒకవేళ అలాంటి నిర్ణయమేదైనా తీసుకోదలిస్తే ముందుగా రాష్ట్రాలను సంప్రదిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఎన్ఆర్సీ చేపట్టాల్సి వస్తే దాన్ని నిగూఢంగా ఉంచాల్సిన అవసరం లేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
* ఉద్యమాల్లో హింసకు తావివ్వకుండా అహింసా మార్గంలో పయనించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శిల్పకళావేదికలో నిర్వహించిన మర్రి చెన్నారెడ్డి శత జయంత్యుత్సవాలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతలతో పాటు వ్యవసాయం ఆటుపోట్లు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
* దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) రుణదాతలతో ఆర్బీఐ నియమించిన దివాల ప్రక్రియ అధికారితో సమావేశం కానున్నారు. ఈ గృహరుణ సంస్థ దివాల ప్రక్రియకు అంగీకరించిన తర్వాత తొలిసారి జరగనున్న సమావేశం ఇదే కావడం గమనార్హం. దేశంలో దివాల ప్రక్రియను ఎదుర్కొంటున్న తొలి నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ ఇదే కావడం గమనార్హం.
* మహాభారతం చేస్తే ఒక్క ఎపిసోడ్ కాదు మొత్తం చేస్తా అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. తాజాగా ఆయన ‘మత్తువదలరా’ నటులను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా సింహా, సత్య, అగస్త్య రాజమౌళి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చారు. అలాగే రాజమౌళి సైతం ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
* ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ భాష అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడ స్థానిక లిపిలో రాసున్న నామ ఫలకాలను చదవడానికి కష్టపడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా కొత్త లిపిని సులభంగా చదవొచ్చని, అదీ కేవలం 15 నిమిషాల్లో నేర్చుకోవచ్చని అంటున్నారు ఐఐటీ మద్రాసులో ‘భారతి లిపి’ ప్రాజెక్టు అసోసియేట్ విజయ్‌కుమార్. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు.
* కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ చెన్నైలోని కొందరు ఆందోళనకారులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. రోడ్లపైనా, కొందరి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. దీంతో పోలీసులు నలుగురు మహిళలను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు.
* ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి వివిధ పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పశ్చిమ్‌బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్, ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు.
* ఓ పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులిచ్చి కొన్ని బాధ్యతల్ని అప్పగించారన్నారు. హన్మకొండలో జరిగిన రెండో విడత పల్లెప్రగతి అవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామ ప్రతినిధులు పల్లె నిధులను సమర్థంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తిచేయాలన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.‘మీరు తెలంగాణకు చెందిన వారన్న సంగతి ఒక్కక్షణం మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే?’ అని ప్రశ్నించగా, కేటీఆర్ తెలివిగా సమాధానం ఇచ్చారు. అది నిర్ణయించేది తాను కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని అన్నారు.
* సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఆయనను చేర్పించినట్లు ఆ పార్టీకి చెందిన నేత ఒకరు వెల్లడించారు. ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను ముంబయికి తరలించాలని వైద్యులు సూచించడంతో ఇక్కడ చేర్పించామన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
* జనవరి 2 నుంచి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. దీన్ని ప్రతి గ్రామం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంత రోడ్లు బాడుపడ్డాయని ఆమె అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన పల్లెప్రగతి అవగాహనా సదస్సులో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
* రాజధాని ప్రాంతంలోని రైతులందరికీ న్యాయం చేస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే ఆందోళనలో పాల్గొంటున్నారని చెప్పారు. తన కార్యాలయంలో ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో ఆర్కే మాట్లాడారు. కేవలం 10శాతం రైతులు మాత్రమే ఆందోళనలో పాల్గొంటున్నారని.. మిగిలిన వారిని తెదేపా అధినేత చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి రప్పించి నిరసనలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
* స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని చిత్రబృందం షురూ చేసింది. ఇందులో భాగంగా జనవరి 6న ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ప్రతిఒక్కరూ విచ్చేసి వేడుకను విజయవంతం చేయాలని చిత్రబృందం పేర్కొంది.
* క్రికెట్ సలహా కమిటీ మాజీ సభ్యులు శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ క్లీన్చిట్ ఇచ్చారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వీరిద్దరు లేరని ఆదివారం ఆయన స్పష్టం చేశారు. కానీ కపిల్దేవ్పై ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
* విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా మూడో రోజు ఆదివారం మధ్యాహ్నం పత్రికా ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సు జరిగింది. కార్యక్రమంలో హాస్య బ్రహ్మ శంకరనారాయణ, ‘తెలుగు వెలుగు’ ప్రతినిధి జాస్తి విష్ణు చైతన్య మాట్లాడారు. శంకరనారాయణ మాట్లాడుతూ.. ‘మా తెలుగు తల్లికి ముళ్ల పూదండ’ అనే పరిస్థితి ప్రస్తుతం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణ ఇంటి నుంచే మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.