ఏదైనా సాధించాలంటే లక్ష్య శుద్ధి ఉండాలి. లక్ష్య శుద్ధి ఉంటేనే లక్ష్య సిద్ధి ఉంటుంది. చాలామంది తమ జీవితంలో ఏదీ సాధించలేక పోవటానికి కారణం తమకేం కావాలో తెలియక పోవటమేనట. నీకేం కావాలి? అని అడిగితే చాలామంది వెంటనే చెప్పలేరు. ఎంతోమంది ఆలోచించినా చెప్ప లేరు. ఎక్కువ మందికి అసలు ఏం కావాలో వారికే తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. పైగా తమకు ఏదీ కలిసి రావటం లేదని, దేవుడిని, ఇంకా వీలైనంత మందిని ఆడిపోసుకుంటారు.
ఈ లక్ష్యం నిశ్చయించుకో వటం చిన్నతనం నుండి అలవాటు చేయవలసి ఉంది. నేటి యువత రంలో ఇటు వంటి నిర్దిష్ట లక్ష్యం కనపడటం అరుదు. చిన్నతనం నుంచి దిశా నిర్దేశం చేయటం అవసరం. చిన్న పిల్ల లను ఎవరినైనా– నువ్వు పెద్ద అయినాక ఏమవాల నుకుంటున్నావు? అని, పోనీ, నువ్వేం చదవాలనుకుం టున్నావు? అని అడగండి. ఏదో ఒకటిలే అంటారు. దేనిలో సీటు వస్తే అదే చదువుతానంటారు. అంకెలను చూస్తే కంగారుపడేవాడు లెక్కలు ప్రధానంగా ఉండే ఇంజనీరింగ్ చదవవలసి వస్తే…? తరువాత ఎప్పుడో నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను నాకిష్టం లేదని అనే మాటలు తప్పవు.
అందుకే చిన్నతనం నుండి ప్రతివారికి ఒక లక్ష్యం ఉండాలి. అపుడు ఈ నిరాశా నిస్పృహలు ఉండే అవ కాశం తక్కువ. జీవితం లక్ష్య సాధనతో సాగుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఫలితం కన్న ప్రయత్నంలోనే తృప్తి ఎక్కువ కనుక తనవంతు కృషి చేయటంలో ఆనందం పొందుతూ ఉంటారు. సరైన లక్ష్యమే లేనప్పుడు జీవి తం గాలివాటంగా సాగుతూ ఉంటుంది.
ఉదాహరణకి ఒక పిల్లవాడిని తల్లి డాక్టరు చెయ్యాలనుకుంటుంది. తండ్రి ఇంజనీర్ని చెయ్యాలను కుంటాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడి బుర్ర లోకి ఎక్కిస్తారు. ఏ ఒక్కదాని మీదా దృష్టి కేంద్రీ కరించటం జరుగదు. దొరికిన కోర్సులో చేరిపోయి,
ఏ గుమస్తాగానో స్థిరపడటం జరుగుతుంది. అలా కాకుండా ఒక్కదానినే అనుకొని, దానిమీదే సర్వ శక్తులు కేంద్రీకరించి ఉంటే అతడు దానిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. ఒక్కటే తెలుసుకుని మిగి లినవి మానెయ్యాలా అనే సందేహం రావచ్చు. ప్రధా నమైన దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి మిగిలినవి ఆను షంగికంగా నేర్చుకోవాలి. అవన్నీ ప్రధాన లక్ష్యానికి సహకరించేట్టు చేసుకోవాలి.
లక్ష్య శుద్ధికి ప్రబలోదహరణం అర్జునుడు పక్షి కంటిని కొట్టమంటే అతడికి అది ఉన్న చెట్టుగానీ, ఆకులుగానీ, పక్షి శరీరంగానీ కనపడలేదు. పక్షి కన్ను మాత్రమే కనపడింది. అదీ లక్ష్య శుద్ధి అంటే. దేని గురించి అయినా అటువంటి ఏకాగ్ర దృష్టి ఉంటే తప్పక సాధిస్తారు. అలా దృష్టి కేంద్రీకరించాలంటే తన లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవటం ప్రధానం. సాధించవలసిన లక్ష్యాన్ని గుర్తించటం నేర్పితే చాలు. పెద్దలు ఇంకేమీ చెప్పనవసరం లేదు. తమకు కావ లసిన దాని కోసం వారే పాటుపడతారు.