DailyDose

SBI డెబిట్ కార్డు రేపటి లోగా మార్చుకోవాలి-వాణిజ్యం-12/30

Convert Your Magnetic Stripe SBI Debit Card By Dec 31st-Telugu Business News Roundup-12/30

* ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఓ గమనిక.. మీ దగ్గర ఇంకా మ్యాగ్‌ స్ట్రైప్‌ డెబిడ్‌ కార్డులు ఉన్నాయా.. అయితే వాటిని మార్చుకునేందుకు రేపే ఆఖరు తేదీ. జనవరి 1 నుంచి మ్యాగ్‌ స్ట్రైప్‌తో ఉన్న డెబిట్‌ కార్డులను ఎస్‌బీఐ బ్లాక్‌ చేయనుంది. దీంతో డిసెంబరు 31లోగా ఈ కార్డులను మార్చుకోవాలని, కొత్త ఈఎంవీ చిప్‌, పిన్‌ ఆధారిత డెబిట్‌ కార్డులను తీసుకోవాలని బ్యాంక్‌ తాజాగా మరోసారి సూచించింది. కొత్త కార్డుల కోసం ఖాతాదారులు తమ హోం బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల మేరకు మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

* ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క నవంబర్‌ నెలలోనే 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గడంతో కంపెనీ ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు సమాచారం. అక్టోబర్‌ నెలలో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు అంతకుముందు ఆ కంపెనీ ప్రకటించడం గమనార్హం. అక్టోబర్‌లో వొడాఫోన్‌ మొత్తం వినియోగదారుల సంఖ్య 37.26 కోట్లు కాగా.. నవంబర్‌ నెలలో ఆ సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు ఆ కంపెనీ ట్రాయ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. వినియోగదారులు తగ్గడం పట్ల స్పందన తెలియజేసేందుకు వొడాఫోన్‌ ఐడియా నిరాకరించింది. అయితే, క్రియాశీలంగా లేని వినియోగదారులను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. క్రియాశీల వినియోగదారులను నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం, అది నవంబర్‌లో జరగడంతో సంఖ్యలో భారీ కోత పడినట్లైంది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 116 పాయింట్లు లాభపడి 41,691 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 12,282 వద్ద కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థల షేర్లలో ఐటీసీ, టీసీఎస్‌ 1శాతానికి పైగా లాభపడ్డాయి.. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 0.5శాతం వరకు నష్టపోయాయి. రంగాల వారీగా సూచీల్లో నిఫ్టీ ఫార్మా సూచీ 0.64శాతం, నిఫ్టీ ఐటీ సూచీ 0.4శాతం పెరిగాయి. ప్రిన్స్‌పైప్స్‌ షేర్లు నేడు లిస్టు కానున్నాయి. ఈ సంస్థ డిసెంబర్‌ 18 నుంచి 21 బిడ్లను స్వీకరించింది.

* జావా సంస్థ మార్కెట్లో తీసుకురానున్న సరికొత్త బైకు పెరాక్‌ బుకింగ్స్‌ జనవరిలో మొదలుపెట్టనుంది. ఇప్పటికే నవంబర్‌లో ఈ సంస్థ బైకు ధరను రూ.1.94 లక్షలుగా వెల్లడించింది. ఇక బైకు డెలివరీలను మాత్రం ఏప్రిల్‌లో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇవి జులై వరకు కొనసాగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బుకింగ్స్‌ను స్వీకరించనుంది. కస్టమర్లను నెలలతరబడి వెచిఉంచకుండా ఈ నిర్ణయం తీసుకొంది. ఈ బైకును బొబ్బెర్‌ డిజైన్‌లో తయారు చేయడంతో చూడటానికి ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతానికి భారత్‌లో విక్రయించే చౌకఅయిన బొబ్బెర్‌ బైకు ఇది.

* చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది (2020) నుంచి ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పతుత్లన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఆఫర్లు ఉంటాయని హామీ ఇచ్చారు.