ScienceAndTech

భారత నౌకాదళంపై సోషల్ మీడియా ఆంక్షలు

Indian Govt Imposes Restrictions On Indian Navy Social Media Usage

భారత నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని శత్రు దేశానికి చేరుస్తున్నారని ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేయడం రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భారత నేవీ తక్షణ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ మార్గంలో ముప్పు పొంచి ఉండటంతో తమ సిబ్బంది సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. నౌకాదళ సిబ్బంది ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లు, నెట్‌వర్కింగ్‌, బ్లాగింగ్‌, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు వంటివి ఉపయోగించుకుండా నిషేధం విధించింది. దీంతో పాటు నేవీ బేస్‌లు, డాక్‌యార్డ్‌లు, యుద్ధ నౌకల్లో స్మార్ట్‌ఫోన్‌లు కూడా వినియోగించరాదని ఆదేశించింది. నౌకదళ సిబ్బంది వలపు ఉచ్చుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తూర్పుతీర నావికాదళ కేంద్ర స్థావరమైన విశాఖపట్నంలోని కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచర్య రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగానికి చెందిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఇటీవల బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర, నౌకాదళ నిఘా విభాగాల సహకారంతో ‘ఆపరేషన్ డాల్ఫిన్‌ నోస్‌’ పేరుతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. గూఢచర్యంలో భాగస్వాములైన ఏడుగురు ఉద్యోగులు, ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్టు చేసింది. 2017లో నావికాదళంలో చేరిన ఈ ఉద్యోగులు 2018లో ఫేస్‌బుక్‌ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకున్నట్లు ఆపరేషన్‌లో తేలింది. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐలో పనిచేసే అందమైన అమ్మాయిల వలలో పడి.. హవాలా సొమ్ముకు ఆశపడి దేశ రహస్యాలను వారికి అందించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేవీ తాజా నిషేధం తీసుకొచ్చింది.