1.త్రిదళాధిపతిగా బిపిన్ రావత్
దశాబ్దాల నిరీక్షణ తర్వాత దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణ చోటుచేసుకుంది. దేశ తొలి త్రిదళాధిపతి (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. మంగళవారం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సోమవారం ఒక నోటిఫికేషన్ వెలువడింది. సీడీఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికీ నాయకత్వం వహిస్తారు.
2. ఇంటి ముంగిటకే ఇసుక
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా కొనుగోలుదారు ఇంటి ముంగికే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. జనవరి 2 నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనుండగా, దీనిపై ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కొత్త విధానం తొలుత కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆరంభించి, జనవరి 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో అమలు చేసి, 20 నుంచి రాష్ట్రమంతా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
3. సోమేశ్ లేదా అజయ్ మిశ్రా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రభుత్వ కొత్త కార్యదర్శిని నియమించనున్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎంపికపై తుది కసరత్తు చేశారు. సోమేశ్‌కుమార్, అజయ్ మిశ్రాలలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త సీఎస్ నియామకానికి సాంకేతిక సమస్యలు ఎదురుగాకుండా మంగళవారం ఉదయం ఆయన కొత్త సీఎస్ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
4. జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవాలి
ఏపీ రాజధాని అమరావతిని మార్చబోమని మేనిఫేస్టోలో చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ప్రజలతో ఓట్లు వేయించుకున్న జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లి గెలుపొంది రాజధానిని మార్చుకోవాలని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సోమవారం గుంటూరు జిల్లా జైలులో రైతులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
5. సేవలన్నీ సచివాలయాల్లోనే..
ఏపీలో కొత్తగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబరు 26 నుంచి కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన రూ.200 కోట్లతో కంప్యూటర్లు, యూపీఎస్‌లు, ప్రింటర్లు, లామినేషన్ యంత్రాలు, వేలిముద్రల స్కానర్లు, ఫర్నిచర్, అంతర్జాల (ఇంటర్నెట్) సౌకర్యాన్ని సమకూర్చారు.
6. ముందస్తు షెడ్యూలు కొత్త పద్ధతి
తెలంగాణలో పురపాలక ఎన్నికల నిర్వహణపై ఆందోళన అవసరంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ వి.నాగిరెడ్డి స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వాటిని నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలు, రిజర్వేషన్లు అందితేనే జనవరి ఏడున పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. ఎన్నికల షెడ్యూలును ముందుగా ఇవ్వడం కొత్త పద్ధతి అని తెలిపారు. 7. అన్ని బ్రాంచీల్లోనూ కృత్రిమ మేధ
వచ్చే ఏడాది మీరు బీటెక్‌లో చేరబోతున్నారా?..అయితే ఏ ఇంజినీరింగ్ బ్రాంచీ ఎంపిక చేసుకున్నా కృత్రిమ మేధ(ఏఐ) సబ్జెక్టు చదవాల్సిందే. సమీప భవిష్యత్తులో ఏఐ దూసుకురాని రంగం ఉండదని నిపుణుల అంచనా. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రతి బీటెక్ బ్రాంచీలో ఈ సబ్జెక్టును బోధించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
7. సీఎం జగన్ నన్ను టార్గెట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను టార్గెట్ చేశారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము టీడీపీలో ఉన్నామనే కక్షతో అధికారాన్నంతా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి బతుకులు ఏంటో తమకు తెలుసునంటూ సీఏం జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 1947లోనే కార్లలో తిరిగిన చరిత్ర తమ కుటుంబానిదని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
8. రైతులు కోరితే భూములిచ్చేస్తాం
తమ భూములు తమకిచ్చేయాలని అమరావతి రాజధాని ప్రాంత రైతులు కోరితే వారి భూములను ఏపీ ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే నిర్మాణాలు జరిగిన భూముల విషయంలో ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఏదో ఒక ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తారన్నారు.
9. నేడు, రేపు శ్రీవారి ఆర్జిత సేవల రద్దు
ఆంగ్ల నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అన్నిరకాల ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అన్ని ఆర్జితసేవలతోపాటు, దాతలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు కల్పించే ప్రత్యేక దర్శనం కోటా రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
10. ఎస్బీఐ రుణ రేట్ల తగ్గింపు
ఎక్స్టెర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తగ్గించింది. వార్షికంగా 8.05 శాతంగా ఉన్న రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.80 శాతం చేసింది. కొత్త రేట్లు జనవరి 1 (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రేటు కోతతో.. ఈబీఆర్ అనుసంధానమైన గృహ రుణ ఖాతాదారులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రుణ గ్రహీతలకు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గుతుందని బ్యాంక్ తెలిపింది.
నేటి పది ప్రధాన వార్తలు-12/31
Related tags :