* భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను విక్రయించటానికి బ్యాంకులకు అనుమతి లభించింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి తమ సొమ్మును రాబట్టుకోవటానికి కోర్టు అనుమతించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్‌కు సంబంధించిన నేరాలను విచారించే ముంబయిలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ న్యాయస్థానం ఈ విధంగా ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన బ్యాంకులు బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు వీలుగా తమ తీర్పును జనవరి 18 వరకు వాయిదా వేసినట్టు కూడా న్యాయస్థానం తెలియచేసింది. జప్తు చేసిన ఆస్తులు ముఖ్యంగా షేర్ల వంటి సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం జనవరి 5న ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తునిగా నిర్ధారించి, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవలసిందిగా ఆదేశించింది. బ్యాంకులు తమకు రావలసిన రూ.6203.35 కోట్ల మొత్తాన్ని 2013 నుంచి 11.5 శాతం వడ్డీతో సహా రాబట్టేందుకు విజయ్ మాల్యా అస్తుల విక్రయానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాయి. కాగా జప్తు చేసిన మాల్యా ఆస్తులను ఎస్బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించుకోవటానికి తమకేమీ అభ్యంతరం లేదని ఈడీ గత సంవత్సరం ఫిబ్రవరిలో సంబంధిత న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపధ్యంలో బ్యాంకుల అభ్యర్ధనలను పరిగణించిన కోర్టు ప్రస్తుత తీర్పును వెలువరించింది. కాగా మార్చి 2016లో దేశం నుంచి పారిపోయిన మాల్యా, అప్పటి నుంచి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.
* కంటి చూపు సరిగా లేని వారి కోసం కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ఆర్బీఐ సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఎంఏఎన్ఐ’(మని) పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. దీన్ని బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. ఈ అప్లికేషన్ సాయంతో కంటి చూపు సరిగా లేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా దీన్ని తయారు చేశామని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఉచితంగానే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని తెలిపారు.
* 2019 సంవత్సరం ఆటోమొబైల్ సంస్థలకు చేదు అనుభవాల్ని మిగిల్చినప్పటికీ చివరి నెల మాత్రం కొంత ఊరటనిచ్చింది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ విక్రయాలు చివర్లో స్వల్పంగా పుంజుకొన్నాయి. ఈ నెలలో 1,33,296 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. గత డిసెంబర్‌తో పోల్చుకొంటే 2.4శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా వేగనార్ వంటి కాంపాక్ట్ కార్లకు డిమాండ్ పుంజుకొంది.
గత ఏడాది ఇదే నెలలో 1,21,479 వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు మారుతీ పేర్కొంది. ఈ సారి 1,24,375 వాహనాలను అమ్మినట్లు వెల్లడించింది. వీటికి ఎగుమతి చేసిన వాహనాల సంఖ్యను కలపలేదు. కాకపోతే మారుతీ తురుపు ముక్క ఆల్టో ఉన్న చిన్న కార్ల విభాగంలో మాత్రం విక్రయాలు 13.6శాతం తగ్గాయి. మధ్యశ్రేణి వాహనమైన సియాజ్ విక్రయాల్లో మాత్రం 62శాతం తగ్గుదల నమోదైంది. కానీ, కాంపాక్ట్ కేటగిరిలోని స్విఫ్ట్, వేగనార్, సెలిరియో, డిజైర్ల విక్రయాలు మాత్రం పెరిగాయి. ఇక ఏప్రిల్-డిసెంబర్ మధ్యలో విక్రయాలు మాత్రం 17శాతం తగ్గాయి.
* డిసెంబర్ నెలలో వస్తుసేవల పన్ను వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. వరుసగా ఈ మైలురాయిని దాటడం ఇది రెండోసారి. ఈ నెలలో రూ.1.03లక్షల కోట్ల మేరకు వసూళ్లను సాధించింది. అంతకుముందు నెలతో పోలిస్తే నవంబర్‌లో రూ.1.03 లక్షల కోట్లు సాధించింది. దాదాపు 6శాతం వృద్ధిరేటును సాధించినట్లైంది. ఆదే మొత్తాన్ని గత నెలలో కూడా కొనసాగించాయి. సీజీఎస్టీ వసూళ్లు రూ.19,962 కోట్లు, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.26,792 కోట్లకు, ఐజీఎస్టీ వసూళ్లు రూ.48,099 కోట్లు వసూలు చేశారు. ఇక గత నెలలో రూ.8,331 కోట్ల మేరకు సుంకం వసూలైంది.
* ఛానెళ్ల రేట్ల పెంపుపై టెలికమ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధన అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019లో న్యూ టారీఫ్ ఆర్డర్ అమల్లోకి వచ్చాక ఛానెళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో నాణ్యతకు సంబంధించి, ఇంటర్ కనెక్షన్‌కు సంబంధించి నియమనిబంధనలను సవరించింది. ఆ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తమకు నచ్చిన చానెల్‌ను ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఛానెళ్లు నిర్ణయించిన ఎమ్మార్పీ రేట్లు మాత్రమే చెల్లిస్తారు. ఈ నిర్ణయంతో ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కానీ, ధరలు పెరగడంతో ఎన్టీవో నిబంధన విమర్శలను ఎదుర్కొంది. దీనిపై ట్రాయ్ వివిధ పక్షాల అభిప్రాయాలను కోరింది. దీనిపై ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ ఎన్టీఏలోని ప్రాథమిక అంశాలను సవరిస్తామని వెల్లడించారు.
* వివిధ రంగాల్లో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు పలు నిర్ణయాలపై కేంద్రం దృష్టి సారించింది. ప్రత్యేకంగా పెట్టుబడుల అనుమతి సెల్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల అనుమతులకు ఒకే దరఖాస్తు ఫారాన్ని కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఒక కంపెనీ ప్రారంభించాలంటే.. దానిపేరు నమోదు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఎగుమతి, దిగుమతి కోడ్, పర్యావరణ అనుమతి లాంటి ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుడు చేసిన దరఖాస్తు ఏదశలో ఉందో తెలుసుకునే సదుపాయం కూడా కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. పెట్టుబడుల ప్రోత్సాహ, అంతర్గత వ్యాపార విభాగం ఈ మేరకు కసరత్తు చేస్తోంది.