కొత్త సంవత్సరంలో జనవరి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 4లక్షల మంది శిశువులు జన్మించినట్టు అంచనా వేస్తున్నామని ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఏజెన్సీ యునిసెఫ్ (UNICEF-యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్) వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఇండియాలో 67,385 మంది చిన్నారులు జన్మించడం విశేషం. ఇండియా తర్వాతి స్థానంలో చైనా ఉంది. జనవరి 1వ తేదీన చైనాలో 42,669 మంది చిన్నారులు జన్మించినట్టు అంచనా వేస్తున్నారు.కొత్త సంవత్సరం 2020లో అందరికంటే ముద్దు పుట్టిన చిన్నారి ఫిజీలో జన్మించినట్టు యునిసెఫ్ వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 3,92,078 మంది శిశువులు జనవరి 1న జన్మించినట్టు అంచనా వేస్తుండగా.. ఇందులో అత్యధికం ఎనిమిది దేశాల్లో జన్మించినట్టు యునిసెఫ్ వెల్లడించింది. అందులో భారత్(67,385), చైనా(46,299), నైజీరియా(26,039), పాకిస్తాన్(16,787), ఇండోనేషియా(13,020),అమెరికా(10,452), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(10,247),ఇథియోపియా(8493) ఉన్నాయి.కాగా, 2018 లో 2.5మిలియన్ల మంది చిన్నారులు.. పుట్టిన నెలలో మృతి చెందినట్టు యునిసెఫ్ తెలిపింది. ఇందులో మూడో వంతు చిన్నారులు పుట్టిన రోజే చనిపోయినట్టు వెల్లడించింది. ముందస్తు ప్రసవాల కారణంగానే ఎక్కువమంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపింది. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో శిశు జననాలకు సంబంధించి మెరుగైన ఫలితాలు సాధించినట్టు యునిసెఫ్ తెలిపింది. ఐదేళ్ల లోపు చనిపోతున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. అయితే అప్పుడే పుట్టిన చిన్నారుల విషయంలో మాత్రం ఇంకా అనుకున్న స్థాయి ఫలితాలు సాధించలేదని పేర్కొంది. 2018లో చిన్నారుల మరణాల రేటును పరిశీలిస్తే.. ఇందులో 47శాతం మంది చిన్నారులు పుట్టిన నెలలోనే చనిపోయినట్టుగా తెలిపింది. 1990లో అది 40శాతంగా ఉంది.2027 వరకు భారత్ చైనా జనాభాను అధిగమించే అవకాశం ఉంది. 2019 నుంచి 2053 మధ్యలో భారత్ జనాభామరో 273 మిలియన్లు పెరగనున్నట్టు యునిసెఫ్ వెల్లడించింది. అదే సమయంలో నైజీరియా జనాభాకూడా 200 మిలియన్ల మేర పెరగనున్నట్టు తెలిపింది. 2050 వరకు ఈ రెండు దేశాల జనాభా ప్రపంచ జనాభా మొత్తంలో23శాతం ఉంటుంది. ప్రస్తుతం చైనా 1.43బిలియన్ల జనాభాతో అగ్రస్థానంలో ఉండగా,భారత్ 1.37బిలియన్ల జనాభాతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 27శాతం.
జనవరి 1న 4లక్షల మంది జన్మించారు
Related tags :